వరుస సినిమాలతో విజయాలను తన ఖాతాలో వేసుకున్న నటి శివానీ నాగరం. ఇటీవల ‘హే బలవంత్’తోనూ అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న విషయాలు సోషల్‌మీడియాలో వివాదమయ్యాయి. తిరుమలలో 15 నిమిషాల పాటు స్వామి దర్శనభాగ్యం దక్కిందని పేర్కొన్నారు. ‘భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం నాలుగైదు సెకన్ల దొరకడమే కష్టమనుకుంటే ఈమె ఇలా చెబుతున్నారేంటి’, ‘సెలబ్రిటీ అయితే చాలు, దగ్గరుండి మరీ దర్శనం చేయించి తీసుకొస్తారు’, ‘ఇంతకీ ఈమె చేసిన సినిమాలేంటి? ఇలా నెటిజన్లు వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు’ ఈ క్రమంలో శివానీ స్పందించారు. శ్రీవాణి టికెట్ కొనుగోలు చేసి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. అంతేకాదు, 15 నిమిషాల సమయంపైనా స్పష్టత ఇచ్చారు.
‘‘ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఈ సందర్భంగా యాంకర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. చిన్నప్పటి జ్ఞాపకాలు, కెరీర్, సక్సెస్, ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా ఒక్కో అంశాన్ని అడిగారు. ఇందులో భాగంగా నా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పంచుకున్నా. రామకోటి రాయడం, కేదార్నాథ్ దర్శనం, శిర్డీ విషయాలను పంచుకునే క్రమంలో ‘తిరుమలలో స్వామివారిని 15 నిమిషాల పాటు దర్శనం చేసుకున్నా’ అనే మాట హైలైట్ అవుతోంది. అంతేకాదు, సోషల్‌మీడియాలో తప్పుగా వెళ్తోంది. అక్టోబరు నెలలో తిరుపతి విమానాశ్రయంలో నేను, మా అమ్మ లైనులో నిలబడి శ్రీవాణి టికెట్స్ తీసుకున్నాం. తర్వాత దర్శనం చేసుకున్నాం’’
‘‘క్యూలైన్లోకి వచ్చినప్పటి నుంచి స్వామి దగ్గరకు వెళ్లేంతవరకూ కొంచెం కొంచెం స్వామివారు కనిపిస్తుంటారు. ఆ సమయం మొత్తం 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పాను. అంతేకానీ, స్వామివారి ముందు నిలబడి 15 నిమిషాల పాటు ఎవరూ టచ్ చేయలేదు అని కాదు. అంతకుముందు కూడా రూ.300 టికెట్ తీసుకుని, కుటుంబంతో వెళ్లాను. అప్పుడు కేవలం నాలుగైదు సెకన్లే చూశాను. 13ఏళ్ల తర్వాత స్వామి వారిని దగ్గరగా చూశానన్న భావనతో అలా చెప్పాను. మీలో ఎవరైనా సరే శ్రీవాణి టికెట్ తీసుకుంటే కచ్చితంగా స్వామి వారిని దగ్గరి నుంచి చూడొచ్చు. దీనిపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ విషయం చెబుతున్నా’’ అని వివరణ ఇచ్చారు.


































