ఆయేషామీరా శరీర అవశేషాలను ఖననం చేసేందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీ, తెనాలి తహసీల్దారును కోరారు. ఈ మేరకు విజయవాడలోని సీబీఐ కోర్టు ఆదేశానుసారం అధికారులకు బుధవారం లేఖలు అందజేశారు. ముస్లిం మతపెద్దలతో సంప్రదించి మృతురాలి శరీర అవశేషాలను తెనాలిలోని ఖబర్‌స్తాన్‌లో 27న ఖననం చేసేందుకు తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలు నిర్ణయించి.. కోర్టుకు తెలియజేశారు. రీపోస్టుమార్టం కోసం సీబీఐ స్వాధీనం చేసుకున్న శరీర అవశేషాలను 27న ఉదయం 10 గంటలకు ఆయేషా తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు ఇటీవల సీబీఐ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులిచ్చిన విషయం విదితమే. అదేరోజు మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఖననం నిర్వహించనున్నారు. కోర్టు ఆదేశాలతో అంబులెన్స్‌లో అవశేషాలను తెనాలిలోని ఖబర్‌స్తాన్‌కు తరలించనున్నారు.
న్యాయవాదులు, విద్యార్థి, మహిళా సంఘాల.. ‘చలో తెనాలి’ ఆయేషామీరా శరీర అవశేషాల ఖననం కార్యక్రమానికి విజయవాడ నుంచి న్యాయవాదులు, మహిళా, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు భారీగా తెనాలి వెళ్లనున్నాయి. 19 ఏళ్లపాటు న్యాయపోరాటం చేసిన ఆయేషామీరా తల్లిదండ్రులకు మద్దతుగా.. ఈ నెల 27న కార్యక్రమం చేపట్టారు. ఆయేషామీరాకు ఆఖరి వీడ్కోలు కోసం దీనిని నిర్వహించనున్నారు. ఆరోజు కోర్టు నుంచి అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లి.. అక్కడి నుంచి తెనాలి వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనే ఆశతో ఉన్నాం : షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా (ఆయేషా తల్లిదండ్రులు)
మా కుమార్తె కేసులో సీబీఐతోపాటు.. అన్ని దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయి. ఘటన జరిగిన… వసతి గృహ వార్డెన్, ఇతర గదుల్లో ఉన్న వారు, సాక్ష్యాలు లేకుండా కేసును తారుమారు చేసిన అప్పటి అధికారులు… వీరిలో ఎవరినీ అరెస్టు చేయకుండా దర్యాప్తు ముగించారు. సీబీఐ కేసు తీసుకున్న తర్వాత న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం కలిగినా.. అది కూడా నెరవేరలేదు. మా కుమార్తె హత్యకు గురైనప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆనాడు మాకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఆయన మహిళలను గౌరవిస్తారని ఆయనే న్యాయం చేస్తారని భావిస్తున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను కలుస్తాం. హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరతాం. మా కుమార్తె హత్యకు గురైన డిసెంబరు 27న ఆయేషామీరా సంస్మరణ దినంగా ప్రభుత్వం ప్రకటించాలి. ఆమె పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఈ తరహా కేసుల్లో బాధితులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.


































