ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. వాటిల్లో పెండింగ్ లో ఉన్న మరో ప్రధాన హామీ అమలు పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
ఎన్నికల హామీలను వరుసగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. సూపర్ సిక్స్ లో భాగంగా ఆడిబడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ 1500 చొప్పున ఇస్తామని చెప్పింది. కాగా.. ఇప్పుడు శాసన మండలి వేదికగా ప్రభుత్వం ఈ పథకం అమలు పైన క్లారిటీ ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఆరు ప్రధాన హామీలు ఇచ్చింది. కాగా, అందులో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చాయి. ఆడిబిడ్డ నిధి కింద 18 ఏళ్ల వయసు దాటిన మహిళలకు నెలకు రూ 1500, నిరుద్యోగ భృతి అమలు చేయాల్సి ఉంది. నిరుద్యోగ భృతి కింద ప్రతీ లబ్ధి దారుడికి నెలకు రూ. 3,000/- భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సూపర్ సిక్స్ లో ఈ రెండు పథకాలు పెండింగ్ లో ఉన్నాయి. కాగా.. ఏపీ శాసనమండలిలో ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలుపై వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నలు లేవనెత్తారు. ‘ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు.. ఇచ్చే ఉద్దేశం ఉందా’ అని ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు ప్రశ్నించారు. జూన్ 2024 నుంచే పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికల సమయంలో బాండ్లు ఇచ్చారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి గుర్తుచేశారు. సభ్యుల ప్రశ్నలకు ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.
పథకాలన్నీ అమలు చేస్తాం
ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల పింఛన్ల మొత్తాన్ని పెంచిందని మంత్రి వివరించారు. వృద్ధాప్య పింఛన్లను 3 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచామని, ఏడాదికి రూ.33 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మంత్రి సమాధానం ఇస్తున్న సమయంలో సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలు కోసం పూర్తిస్దాయిలో పరిశీలన జరుగుతోందని, అంచనాలు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవి పూర్తి కాగానే ఇతర పథకాల్లాగే దీన్ని కూడా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం లోటు బడ్జెట్ ఇచ్చినా తల్లికి వందనం, పెన్షన్ పెంపు, స్త్రీశక్తి లాంటి ఎన్నో స్కీమ్స్ అమలు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి తెలిపారు. ఆడబిడ్డ నిధి పథకంపై విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇతర పథకాల తరహాలోనే ఆడబిడ్డ నిధి పథకం కూడా పూర్తిస్ధాయిలో అధ్యయనం చేసి అమలు చేయాలని అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.



































