రాజస్థాన్లో విషాదం.. బడిలోనే కుప్పకూలి 9 ఏళ్ల బాలిక మృతి
రాజస్థాన్లో గుండెను కలచివేసే సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల ప్రాంగణంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్న 9 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు కారణం కార్డియాక్ అరెస్ట్ (గుండెపోటు) కావచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన (Girl Dies of Cardiac Arrest) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాగౌర్ జిల్లా (Rajasthan’s Nagaur) పరిధిలోని గోటన్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర బపేడియా కుమార్తె దివ్య (9), స్థానిక ఇంటర్నేషనల్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 23న ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లిన దివ్య, ప్రార్థన సమయానికి ముందు స్నేహితులతో కలిసి మైదానంలో ఆడుకుంటోంది. ఆ సమయంలోనే హఠాత్తుగా కిందపడిపోయింది. వెంటనే గమనించిన స్కూల్ సిబ్బంది ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దివ్య శరీరంపై ఎలాంటి దెబ్బల గుర్తులు లేవని, బహుశా కార్డియాక్ అరెస్ట్ వల్లనే మృతి చెంది ఉండవచ్చునని వైద్యులు తెలిపారు.
ఇక, ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే, కొన్ని నెలల క్రితం దివ్య సోదరుడు అభిషేక్ కూడా ఇదే విధంగా మరణించాడు. గత ఏడాది సెప్టెంబరులో ఇంట్లో ఆడుకుంటూ ఉన్న అభిషేక్ కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తరలించే లోపే అతడు మృతి చెందాడు. ఇలా కేవలం నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలను కోల్పోయి తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

































