పనిమనిషి నుంచి పరిశోధకురాలిగా…

కష్టకాలంలో కాస్త ఓపిక వహిస్తే జీవితంలో పైకి ఎదగడం కష్టం కాదని నిరూపించడమే కాక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ మహిళ జీవితగాథ ఇది. ఒంటరి తల్లిగా కొడుకును పోషించుకోవడానికి పనిమనిషిగా జీవితాన్ని ప్రారంభించారామె. ఊహించని విధంగా లభించిన ప్రోత్సాహం ఆమెను ఖగోళ శాస్త్రవేత్తను చేసింది. ఆమె పేరు విలియమినా ఫ్లెమింగ్‌.


విలియమినా 1857 మే 15న స్కాట్లాండ్‌లో జన్మించారు. పేద కుటుంబం. చిన్న వయసులోనే తండ్రి మరణించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పద్నాలుగేళ్లకే సహాయ ఉపాధ్యాయినిగా పనిచేయడం ప్రారంభించారు. ఇరవయ్యేళ్ల వయసులో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జేమ్స్‌ ఫ్లెమింగ్‌తో వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ ఉపాధి వెతుక్కుంటూ అమెరికాకు వలస వెళ్లారు. అక్కడే కొడుకు పుట్టాడు. సరైన ఉద్యోగం దొరక్క, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక కొన్నాళ్లకే జేమ్స్‌ భార్యాబిడ్డల్ని వదిలేసి వెళ్లిపోయాడు. చేసేది లేక బిడ్డను పోషించుకోవడానికి బోస్టన్‌లో ఒకరింట్లో పనిమనిషిగా చేరింది విలియమినా. ఆ ఇంటి యజమాని హార్వర్డ్‌ కాలేజీ అబ్జర్వేటరీ డైరెక్టర్‌ ఎడ్వర్డ్‌ చాల్స్‌ పికరింగ్‌.

విలియమినా చదువుకుందని, టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉందన్న సంగతి కుటుంబసభ్యుల ద్వారా పికరింగ్‌ దృష్టికి వచ్చింది. అప్పటికే కాలేజీలో తన సహాయక సిబ్బంది పనితీరు నచ్చక విసిగిపోయి ఉన్న పికరింగ్, విలియమినాకు తన దగ్గర పార్ట్‌ టైమ్‌ క్లర్కుగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చారు. ప్రారంభంలో గణాంకాల నమోదు, రికార్డుల నిర్వహణ పనులు చెప్పారు. విలియమినా పనితీరు, ఆసక్తిని గమనించి కొద్దికాలంలోనే పూర్తిస్థాయి ఉద్యోగినిని చేయడమే కాక మరికొందరు మహిళలతో కలిపి ఏర్పాటుచేసిన ‘హార్వర్డ్‌ కంప్యూటర్‌’ అనే బృందంలో ఆమెను భాగస్వామిని చేశారు పికరింగ్‌. ఆ బృందంతో కలిసి పనిచేస్తూ నక్షత్రాలను ఎలా పరిశీలించాలి, ఏయే వివరాలు నమోదు చేయాలి.. అనే విషయాలపై కొద్దికాలంలోనే ఆమె పట్టు సాధించారు. పికరింగ్‌ మార్గదర్శకత్వంలో స్వభావం ఆధారంగా నక్షత్రాల వర్గీకరణను విజయవంతంగా చేశారు. దీన్ని పికరింగ్‌- ఫ్లెమింగ్‌ వర్గీకరణ అని పిలుస్తున్నారు. ఆధునిక నక్షత్రాల వర్గీకరణకు ఈ విధానమే పునాది. తన జీవితకాలంలో సుమారు పదివేల నక్షత్రాలను వర్గీకరించారు విలియమినా. ఆమె ఆవిష్కరణల్లో అత్యంత కీలమైనదిగా హార్స్‌ హెడ్‌ నెబ్యులాను పేర్కొంటారు.

పనిని ఇష్టపడి, అంకితభావంతో చేస్తున్న విలియమినాను 1898లో హార్వర్డ్‌లో ఖగోళ ఫొటోల క్యురేటర్‌గా నియమించారు. ఆ పదవికి ఎంపికైన తొలిమహిళ ఆమే. రాయల్‌ ఆస్ట్రొనామికల్‌ సొసైటీలో గౌరవ సభ్యురాలిగానూ ఎంపికై, ఆ గౌరవం అందుకున్న తొలి అమెరికా వనిత అయ్యారు. పలు అవార్డులు, గౌరవాలు పొందిన విలియమినా పేరును చంద్రుడిపై ఓ బిలానికి, ఓ గ్రహ శకలానికి పెట్టడం విశేషం. పరిశోధనలు కొనసాగిస్తూనే న్యుమోనియా కారణంగా 54 ఏళ్ల వయసులో చనిపోయారు విలియమినా. నక్షత్రాల ఏర్పాటు, గెలాక్సీల నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి ఆమె ఆవిష్కరణలు ఎంతగానో తోడ్పడ్డాయి. ఖగోళ ఫొటోగ్రఫీ, డేటా విశ్లేషణలో సరికొత్త శకానికి ఆమె నాంది పలికారు. లింగవివక్షను అధిగమించి, ఖగోళశాస్త్రంలో మహిళలు పనిచేయడానికి దారిచూపిన వ్యక్తిగా విలియమినాను ప్రపంచం గుర్తించింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.