పీజీ వైద్య విద్యార్థిని దీపిక కేసులో సీనియర్‌ అరెస్ట్‌..ప్రేమించి, పెళ్లికి తిరస్కరించిన అమర్‌ సహస్‌రెడ్డి

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్తీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో ఆమె సీనియర్‌ డాక్టర్‌ అమర్‌ సహస్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతణ్ని సోమవారం విజయవాడలోని మాచవరం స్టేషన్‌కు పిలిచి, విచారించారు. దీపికను ప్రేమించిన అమర్‌ పెళ్లికి నిరాకరించి, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడని నిర్ధారణకు వచ్చారు. ఆ మేరకు అనుమానాస్పద మృతి నుంచి సెక్షన్‌ మార్చారు. అనంతరం అరెస్టు చేసి, న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.


రెండు గంటల ఫోన్‌ సంభాషణ: అనంతపురానికి చెందిన కోదండరామిరెడ్డి, భారతి దంపతుల చిన్న కుమార్తె దీపిక. తిరుపతి వెంకటేశ్వర వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో అనస్తీషియా విభాగంలో పీజీ చివరి ఏడాది చదువుతోంది. గత నెల 5న విధి నిర్వహణలో ఉన్న దీపిక అర్ధరాత్రి ఆసుపత్రి సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్‌ థియేటర్‌లో బెడ్‌పై విగతజీవిగా కనిపించింది. దీనిపై మాచవరం స్టేషన్‌లో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. సోమవారం అమర్‌ను పిలిచి విచారించారు. ‘పీజీలో దీపికకు సీనియర్‌ అయిన హైదరాబాద్‌లోని బాచుపల్లికి చెందిన అమర్‌ సహస్‌రెడ్డితో ఏడాదిగా పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మరోవైపు అమర్‌ విశాఖపట్నంలో గీతమ్స్‌లో ఎంబీబీఎస్‌ చదువుతున్నప్పుడు తన బ్యాచ్‌మేట్‌ను ప్రేమించాడు. ఇటీవల వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దీపికను దూరం పెడుతుండటంతో వారిద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. పీజీ పూర్తయ్యాక అతను నందిగామలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నాడు. దీపిక మరణించిన రోజున చివరిగా ఇద్దరి మధ్య రాత్రి 10.40 నుంచి అర్ధరాత్రి 12.30 వరకు ఫోన్‌ కాల్‌ నడిచింది. తన పెళ్లి ఖాయమైందని, నిన్ను వివాహం చేసుకోలేనని అమర్‌ తెగేసి చెప్పాడు. ఒకసారి విజయవాడ రావాలని ఆమె కోరినా తిరస్కరించాడు. దీంతో దీపిక ఆత్మహత్యకు పాల్పడింది’ అని విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

రోగికి మత్తు ఇచ్చే సమయంలో కండరాలు రిలాక్స్‌ అయ్యేందుకు వాడే ఓ ఇంజక్షన్‌ను తీసుకోవడంతో ఆమె మృతి చెందినట్లు ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించింది. పెళ్లికి అమర్‌ నిరాకరించడంతో.. ఈ ఇంజక్షన్‌ను చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మరోవైపు దీపిక తండ్రి కోదండరామిరెడ్డి రెండు రోజుల కిందట నందిగామ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అమర్‌తో మాట్లాడారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని ప్రశ్నించారు. ఓ కేసు విషయమై దీపిక ఫోన్‌ చేసిందని, అంతకు మించి తనకేం తెలియదని అమర్‌ చెప్పినట్లు తెలిసింది.