అంబులెన్సులో బ్రెయిన్‌-డెడ్‌ మహిళ.. ‘భారీ కుదుపు’తో తిరిగొచ్చిన ప్రాణం!

బ్రెయిన్‌ డెడ్‌కు గురైన ఓ మహిళ ప్రాణాలపై ఆశలు కోల్పోయిన కుటుంబం ఆమెను అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తోంది. మార్గమధ్యలో ఓ గుంత కారణంగా వాహనం భారీ కుదుపునకు గురైంది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ.. ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. అంత్యక్రియల ఏర్పాట్లకు సిద్ధమైన ఆ కుటుంబం.. ఈ అనూహ్య పరిణామంతో తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నప్పటికీ.. తమ చికిత్స ఫలితంగానే ఆమె కోలుకున్నట్లు వైద్యులు చెప్పడం గమనార్హం. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


పిలిభిత్ జిల్లాకు చెందిన వినితా శుక్లా.. స్థానిక జిల్లా కోర్టులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 22న ఇంటి పనులు చేస్తుండగానే ఒక్కసారిగా కింద పడిపోయారు. అధిక రక్తపోటు కారణమని భావించిన కుటుంబ సభ్యులు.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరేలీలోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అపస్మారక స్థితిలోనే ఉండిపోయిన ఆమె బతికే అవకాశాలు తక్కువేనని వైద్యులు చెప్పడంతో.. ఇంటికి తీసుకెళ్లిపోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

‘‘ఫిబ్రవరి 24న అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా.. బరేలీ-హరిద్వార్‌ జాతీయ రహదారిపై ఓ చోట భారీ గుంత ఎదురైంది. ఆ సమయంలో వాహనం తీవ్ర కుదుపునకు గురైంది. వెంటనే ఆమె స్పృహలోకి రావడంతోపాటు శ్వాస తీసుకోవడం ప్రారంభించారు’’ అని బాధితురాలి భర్త కుల్దీప్‌ శుక్లా పేర్కొన్నారు. వెంటనే అంత్యక్రియల ఏర్పాట్లు నిలిపివేయాలని గ్రామస్థులకు చెప్పిన ఆయన.. తిరిగి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె కాలిపై గాయం ఉండడంతో ఏదైనా విషపూరిత సర్పం లేదా కీటకం కరిచి ఉండొచ్చనే అనుమానంతో ఆ దిశగా చికిత్స అందించారు. మొత్తంగా 12 రోజులపాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకోవడం విశేషం.