పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మన దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్ల సరఫరా బంద్ చేశారు.
దీంతో హోటళ్లు మూతపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రెస్టారెంట్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, వాటి సరఫరాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడినన్ని సిలిండర్లు ఉన్నాయని.. ప్రజలెవరూ అనవసర ఆందోళనకు గురికావొద్దని సూచించారు.
ఇలాంటి కీలకమైన సమయంలో ఎల్పీజీ గ్యాస్ పక్కదారి పట్టకుండా.. అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా జిల్లాల వారీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు నాదెండ్ల మనోహర్ సూచించారు. జిల్లాల జాయింట్ కలెక్టర్లు ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గృహ వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే విషయంలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అవసరమైతే వాణిజ్య అవసరాలకు అందించే గ్యాస్‌ను.. ప్రాధాన్యం ప్రకారం గృహ అవసరాలకు అందించే ఏర్పాట్లు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
మరోవైపు రోజువారీ అవసరాలకు కావాల్సిన గ్యాస్ నిల్వల్లో తేడా వస్తే, ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనేదీ ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వివరించారు. వంట గ్యాస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరా, ఉత్పత్తి విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
వంటగ్యాస్ కొరతతో హోటళ్లకు దెబ్బ
మరోవైపు వంటగ్యాస్ కొరతతో చిన్న హోటళ్ల వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని పెట్రోలియం కంపెనీలు డీలర్లను ఆదేశించాయి. ఈ నేపథ్యంలో హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని విశాఖపట్నం హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ వెల్లడించారు. సిలిండర్ల సరఫరా మరింత తగ్గవచ్చని అన్నారు. విశాఖలో బ్లాక్ మార్కెట్ నడుస్తోందని, గ్యాస్ కొరత లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

































