Black Neck: మెడ నలుపును సులువుగా వీటితో తొలగించుకోవచ్చు, ఖర్చేమీ కాదు

చాలామందికి ముఖం తెల్లగా ఉన్న మెడ మాత్రం నల్లగా కనిపిస్తుంది. చెమట, దుమ్ము, ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ పేరుకుపోవడం వంటి కారణాల వల్ల మెడపై నల్లదనం వస్తుంది. చాలా మంది దీనికి క్రీములు, ఖరీదైన ట్రీట్మెంట్లు వాడాలని అనుకుంటారు. అయితే ఇంట్లోనే ఉన్న కొన్ని సహజ పదార్థాలతో మెడ నల్లదనాన్ని తగ్గించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.


బంగళాదుంప రసం
ఇంట్లో బంగాళాదుంపలు సహజంగానే ఉంటాయి. వాటిని రసం తీసి మెడ నల్లదనాన్ని తగ్గించుకోవచ్చు. బంగాళాదుంపలో చర్మాన్ని సహజంగా లైట్ చేసే గుణాలు ఉంటాయి. ఒక బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని మెడపై రాసి సుమారు 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో కడగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మెడపై నల్లదనం తగ్గి చర్మం కాస్త వెలిగినట్టు కనిపిస్తుంది. ఇంకా అలోవెరా జెల్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలోవెరా చర్మాన్ని మృదువుగా చేసి శుభ్రంగా ఉంచుతుంది. ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకుని మెడపై మృదువుగా రాయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా రాసి ఉదయం కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచి నల్లదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

పెరుగుతో ప్యాక్
పెరుగు, శెనగపిండి, పసుపు కలిపి చేసే ప్యాక్ కూడా మెడ నల్లదనానికి మంచి పరిష్కారం. ఒక చెంచా పెరుగు, ఒక చెంచా శెనగపిండి, కొద్దిగా పసుపు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడపై రాసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత మెల్లగా రుద్దుతూ కడగాలి. ఇది డెడ్ స్కిన్ తొలగించి మెడను శుభ్రంగా చేస్తుంది. వారం లో రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చర్మం శుభ్రం కావడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మంలో ఉన్న మురికిని తొలగించి pH స్థాయిని సరిచేస్తుంది. ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అదే పరిమాణంలో నీరు కలపాలి. కాటన్‌తో మెడపై రాసి కొన్ని నిమిషాలు ఉంచి తర్వాత కడగాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మెడ క్రమంగా శుభ్రంగా కనిపిస్తుంది.

ఇంకా దోసకాయ కూడా చర్మానికి చాలా మంచిది. దోసకాయను తురిమి మెడపై రాసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగితే చర్మం చల్లగా ఉండి నల్లదనం తగ్గుతుంది. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. ఇవి మాత్రమే కాదు, కొన్ని చిన్న అలవాట్లు కూడా మెడ నల్లదనం తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ స్నానం చేసే సమయంలో మెడ భాగాన్ని బాగా శుభ్రం చేయాలి. బయటకు వెళ్తే సన్‌స్క్రీన్ వాడటం మంచిది. చెమట వచ్చిన తర్వాత మెడను తుడుచుకోవాలి. అలాగే గట్టిగా రుద్దడం, బలంగా స్క్రబ్ చేయడం చేయకూడదు. అలా చేస్తే చర్మం మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

మెడ నల్లదనం తగ్గించడానికి ఖరీదైన చికిత్సలు అవసరం లేదు. ఇంట్లోనే ఉండే బంగాళాదుంప, అలోవెరా, పెరుగు, దోసకాయ వంటి సహజ పదార్థాలను క్రమంగా వాడితే మెడ చర్మం క్రమంగా శుభ్రంగా, కాంతివంతంగా మారుతుంది. సరైన శుభ్రత, చిన్న స్కిన్ కేర్ అలవాట్లు పాటిస్తే ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు.