Viral: ఇదేం బాదుడు సామీ! బిల్లులో ‘గ్యాస్ ఛార్జ్’

సాధారణంగా హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేస్తే ఇడ్లీ, వడ ధరలతో పాటు చివర్లో జీఎస్టీ వేయడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు సీన్ మారింది. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో, ఆ భారాన్ని ఏకంగా కస్టమర్ల మీదనే వేసేస్తున్నాయి కొన్ని హోటళ్లు.
‘గ్యాస్ సప్లై ఇష్యూ’ పేరుతో బిల్లులో అదనపు ఛార్జీలు చూసి జనం అవాక్కవుతున్నారు.


చెన్నైలోని ‘గీరాస్’ రెస్టారెంట్‌లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ టిఫిన్ చేసిన ఒక వ్యక్తికి వచ్చిన బిల్లు చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇడ్లీ, వడ ధరల కిందే ప్రత్యేకంగా ‘గ్యాస్ ఛార్జ్’ అని పేర్కొని సుమారు 10 రూపాయల వరకు వసూలు చేశారు. మొత్తంగా 80 రూపాయల బిల్లులో గ్యాస్ కోసం అదనంగా చెల్లించాల్సి రావడంతో సదరు కస్టమర్ ఆ బిల్లును సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్తా వైరల్ అయ్యింది.
పీజీలో తిండి లేక వెళ్తే.. ఇక్కడ ‘గ్యాస్ స్కామ్’!

కేవలం చెన్నై మాత్రమే కాదు, ఐటీ హబ్ బెంగళూరులోనూ ఇదే పరిస్థితి. అక్కడ ‘మిస్టర్ ఆంధ్ర మీల్స్’ అనే హోటల్‌కు వెళ్లిన నరేష్ కుమార్ అనే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. గ్యాస్ కొరత సాకుతో ఏకంగా 30 రూపాయలు అదనంగా వసూలు చేశారు. “పీజీలో తిండి లేక హోటల్‌కు వెళ్తే.. అక్కడ ఇలా గ్యాస్ పేరుతో దోచుకుంటున్నారా?” అంటూ ఆయన బెంగళూరు సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. గ్యాస్ కొరత ఉంటే ధరలు పెంచుకోవాలి కానీ, ఇలా విడిగా బిల్లు వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
నెటిజన్ల ఫైర్.. పచ్చి దోపిడీ అంటూ కామెంట్స్!

ఈ బిల్లులపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “సంక్షోభం ఏదైనా బలి అయ్యేది మధ్యతరగతి వాడే” అని ఒకరు ఆవేదన వ్యక్తం చేయగా, “బిల్లులో గ్యాస్ ఛార్జ్ చూడటం చాలా హాస్యాస్పదంగా ఉంది” అని మరొకరు ఎద్దేవా చేశారు. ఆహార పదార్థాల ధరలోనే లాభం, ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి కదా.. మళ్ళీ గ్యాస్ కోసం విడిగా వసూలు చేయడం పచ్చి దోపిడీ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల కొరతతో కొన్ని హోటళ్లు మూతపడగా, నడుస్తున్న కొన్ని హోటళ్లు ఇలా కస్టమర్ల మీద భారం వేయడం చర్చనీయాంశంగా మారింది.