రీయూనియన్ల పేరుతో స్నేహితులంతా మళ్లీ కలుసుకొని చిన్ననాటి ముచ్చట్లు కలబోసుకొంటున్న వైనాలు చూస్తున్నాం. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో 50 ఏళ్ల తర్వాత కలుసుకొన్న ముగ్గురు మిత్రులు మాత్రం 62 ఏళ్ల వయసులో బాల్యపు గొడవను మళ్లీ గుర్తుతెచ్చుకొని జుట్లు పట్టుకొన్నారు.
బాలకృష్ణన్, వీజే బాబు కాసర్‌గోడ్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. 4వ తరగతిలో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య గొడవ జరిగి బాలకృష్ణన్‌ను వీజే బాబు కొట్టారు. ఇది దాదాపు 1970ల నాటి ముచ్చట. బాలకృష్ణన్ ఇటీవల తన స్నేహితుడైన మాథ్యూతో కలిసి బయటకు వెళ్లగా..
అక్కడ అనుకోకుండా వీజే బాబు కలిశారు. చిన్ననాడు వీజే బాబు తనను కొట్టాడనే విషయాన్ని మనసులో పెట్టుకున్న బాలకృష్ణన్ మాటల మధ్యలో.. నాలుగో తరగతిలో నన్ను ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. మాటా మాటా పెరిగి బాబుపై దాడి చేశాడు. మాథ్యూ కూడా ఓ చేయి వేయడంతో గాయాలపాలైన వీజే బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుపోయిన పోలీసులు బాబును కన్నూరు ఆస్పత్రికి తరలించి.. బాలకృష్ణన్, మాథ్యూను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
































