మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు యావత్ దేశంలో సంచలనం రేపింది. హనీమూన్ పేరుతో షిల్లాంగ్‌కు తీసుకెళ్లి భర్తను భార్యే చంపించిన కేసు దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
ఒకానొక సమయంలో తాము అలసిపోయామని, హత్య చేయలేము అని హంతకులు చెప్పినా సోనమ్ వినిపించుకోలేదట. అంతేకాదు తన భర్తను చంపేస్తే 20లక్షలు ఇస్తానని హంతకులకు ఆఫర్ చేసిందట.
తన భర్త రాజా రఘువంశీ హత్యకు కిరాయి హంతకులకు సోనమ్ రఘువంశీ రూ.4 లక్షలు ఆఫర్ చేసిందని, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచిందని విచారణలో తెలిసింది. పోలీసు ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం, రఘువంశీ మృతదేహాన్ని మేఘాలయలోని ఒక లోయలోకి నెట్టడంలో నిందితులకు సోనమ్ సాయం చేసిందట.
జూన్ 2న తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా ప్రాంతంలో (చిరపుంజి అని కూడా పిలుస్తారు) ఒక జలపాతం సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ చేరుకున్న కొన్ని రోజుల తర్వాత రాజా రఘువంశీ శవమై కనిపించాడు.
సోనమ్ నియమించుకున్న సుపారీ హంతకులు మొదట బెంగళూరులో నూతన వధూవరులను కలిశారు. అక్కడి నుండి వారు ఈశాన్యానికి కనెక్టింగ్ విమానంలో ప్రయాణించారు. మృతుడు, నిందితులు ఒకే నగరానికి చెందిన వారు కావడంతో వారు మాట్లాడుకున్నారు.
”మే 11న రాజా, సోనమ్ ల వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే సోనమ్ రఘువంశీ తన ప్రేమికుడు రాజ్ కుష్వాహాతో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. హనీమూన్ కోసం మేఘాలయకు వన్-వే టికెట్ ప్లాన్ చేయడం అందులో భాగమే. రాజ్ కుష్వాహా మేఘాలయకు ప్రయాణించకపోయినా, నిత్యం సోనమ్‌తో టచ్‌లో ఉంటూ తెర వెనుక ప్రణాళిక రచించాడు” అని పోలీసులు తెలిపారు.
నిందితులు మొదట మే 21న నూతన వధూవరులను గౌహతిలో అనుసరించారు. వారి హోటల్‌కు దగ్గరగా బస చేశారు. తర్వాత మే 22న షిల్లాంగ్‌కు వెళ్లారు. మరుసటి రోజు వారు రాజాను హత్య చేశారు. మే 23న, సోనమ్, రాజా రఘువంశీ జలపాతాన్ని చూడటానికి నిటారుగా ఉన్న శిఖరానికి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. హంతకులు వారిని ఫాలో అయ్యారు. ఒక సమయంలో, సోనమ్ అలసిపోయినట్లు నటించింది. తన భర్త, హంతకులకు చాలా దూరంగా నడవడం ప్రారంభించింది. వారు నిర్జన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, సోనమ్ తన భర్తను చంపమని ఆ వ్యక్తులను కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే, తాము అలసిపోయామని, రాజాను చంపడానికి హంతకులు నిరాకరించారని తెలుస్తోంది. ఎలాగైనా భర్తను చంపేయాలని నిర్ణయించుకున్న సోనమ్.. తన ఆఫర్ ను 20 లక్షలకు పెంచారని వారు చెప్పారు. అంతేకాదు రాజా మృతదేహాన్ని పడవేయడంలో సోనమ్ నిందితులకు సాయం చేసిందని తెలుస్తోంది. ప్రాథమిక శవపరీక్ష నివేదిక ప్రకారం రాజా రఘువంశీ తల వెనుక, ముందు భాగంలో గాయాలు ఉన్నాయి.