అడవిలో ఊహించని ఘోరం.. తండ్రీకొడుకులను చంపేసిన ఎలుగుబంటి.

శనివారం నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం,( Chhattisgarh ) కాంకేర్ జిల్లాలో( Kanker District ) ఓ భయంకర విషాదం చోటు చేసుకుంది. కొరార్ ఫారెస్ట్ రేంజ్‌( Korar Forest Range ) పరిధిలో ఉన్న డోంగర్‌కట్ట గ్రామం సమీపంలో ఓ పెద్ద ఎలుగుబంటి ( Bear ) తండ్రీ కొడుకులపై దాడి చేసింది.


ఆ దాడిలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. సుక్లాల్ దర్రో (45), అజ్జు కురేటి (22) అనే ఇద్దరు వ్యక్తులు జైల్‌కాసా కొండపై కట్టెలు ఏరుకునేందుకు వెళ్లారు. అక్కడ వారిపై ఓ మృత్యువులా ఓ ఎలుగుబంటి ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ దాడిలో సుక్లాల్ దారుణంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అజ్జు మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడాడు. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అజ్జును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఎలుగుబంటి ప్రజలపై, అటవీ శాఖ గార్డుపై దాడి చేస్తున్న దృశ్యాలు భయానకంగా అనిపించాయి. గార్డును ఎలుగుబంటి నేలకేసి ఒత్తుతూ కొరుకుతూ గాయపరిచింది, అది అతడు తప్పించుకోకుండా పట్టుకున్న తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది.
చివరికి అధికారులు జేసీబీ యంత్రాలను ఉపయోగించి సుక్లాల్, శంకర్ దర్రోల మృతదేహాలను అడవిలోంచి వెలికి తీశారు. ఇప్పటికీ ఆ ఎలుగుబంటి మాత్రం పట్టుబడలేదు. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలోనే ఉండి ఎలుగుబంటి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు గ్రామస్తులు అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.