జగన్ కు షాక్; అన్నను గద్దె దింపి తీరుతా.. వైఎస్ షర్మిల శపథం!!

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాజాగా శపధం చేశారు. ఏపీలో తన సోదరుడు సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపి తీరుతానని వైయస్ షర్మిల శపథం చేయడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటివరకు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిల, వచ్చే ఎన్నికలలో వైసీపీని గద్దె దించటం ఖాయమని చేసిన వ్యాఖ్యలతో జగనన్న విసిరిన బాణం ఇప్పుడు రివర్స్ అయిందని చర్చ జరుగుతుంది.

తాజాగా తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గంలో పర్యటించిన వైయస్ షర్మిల అక్కడ రోడ్ షోలో పాల్గొని అనంతరం నిర్వహించిన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాని కారణంగా ఎంతో నష్టపోయామని, ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో వేల ఉద్యోగాలు వచ్చేవని ఆమె పేర్కొన్నారు.

జగన్ ఓ నియంత.. త్వరలోనే గద్దె దింపుతానని, ఇది నా శపథం అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత కెసిఆర్ ను గద్దె దింపానని, ఏపీలోనూ నియంతను గద్దె దింపి తీరుతానని ఆమె పేర్కొన్నారు. వైయస్సార్ ఆశయాలని అన్న ఎన్నో చెప్పారని, ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగారని కానీ అవకాశం ఇచ్చిన ప్రజల కోసం ప్రత్యేక హోదా ఉద్యమం కూడా చేయలేదని పేర్కొన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం జగన్ కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని వైయస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. నగరిలో నిర్వహించిన సభలో వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే అనే వ్యాఖ్యలను 12 సార్లు చేశారు. నియంత ప్రభుత్వం అంటూ పదిసార్లు వ్యాఖ్యానించారు. వైయస్సార్ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, నేడు జగన్ హయాంలో వ్యవసాయం దండగ అనేది కనిపిస్తుందని షర్మిల ఆరోపించారు.

రాష్ట్రంలో అప్పులు లేని రైతు ఒక్కరు కూడా లేరని వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావడంలేదని షర్మిల విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా దోచుకోవడం తప్ప వేరే కనిపించడం లేదన్న షర్మిల ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఇలాంటి వాళ్ళా మనకు నాయకులు అంటూ మండిపడ్డారు. ఇలాంటి పాలకులను గద్దె దించాల్సిన అవసరం ఉందని వైయస్ షర్మిల ప్రజలకు సూచించారు.