AP Govt: ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్ ఆదేశాలు
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఎత్తివేసింది. ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాసేపట్లో పోస్టింగ్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వనుంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎత్తివేయనుంది. ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ ఏర్పడిన వెంటనే ఏవీబీపై కక్షగట్టింది. ఏబీవీని సస్పెండ్ చేసింది. దాంతో ఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. క్యాట్ ఉత్తర్వులను జగన్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. ఆ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో ఏపీ సర్కార్ ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల నుంచి ఏబీవీ సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ రోజు ఏబీవీ చివరి వర్కింగ్ డే.. రిటైర్మెంట్ డే రోజున విధుల్లోకి రానున్నారు. ఆ వెంటనే పదవీ విరమణ చేస్తారు. మొత్తానికి ఇలా జగన్ సర్కార్ ఏవీ వెంకటేశ్వర రావు చివరి పని దినం రోజున కొలువు ఇచ్చి తన పైశాచిక ఆనందాన్ని చాటుకుంది.
AB Venkateswara Rao: ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు నియామకం..
అమరావతి: కాసేపటి క్రితం సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్ట్ ఉత్తర్వులు మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు మొదటిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అప్పుడు కూడా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పోస్టింగ్ ఇచ్చింది. కొద్దిసేపట్లో ఏబీ వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. తిరిగి ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.