ఇంజినీర్లు, సైంటిస్టులు కావాలనుకునే విద్యార్థులకు ఐఐటీలో (IIT) చేరడం ఒక పెద్ద కల. హై అకాడమిక్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఇన్నోవేషన్‌లో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇండియాలో టాప్ మోస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఇవి. ఇప్పటి వరకు ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం ‘జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్’ (JEE)లో ర్యాంకు సాధించాలి. అయితే ఐఐటీ మద్రాస్ (IIT Madras), జేఈఈ స్కోర్ అవసరం లేకుండానే అడ్మిషన్స్ ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో ప్రతిభ కనబర్చిన వారికి నేరుగా యూజీ కోర్సుల్లో అడ్మిషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఐఐటీ మద్రాస్ (IIT Madras) తీసుకున్న ఈ నిర్ణయం అడ్మిషన్ ప్రాసెస్‌లో కీలక మార్పులు తీసుకురానుంది. ఒలింపియాడ్‌లో టాలెంట్ చూపిన వారి కోసం ప్రత్యేకంగా ‘సైన్స్ ఒలింపియాడ్ ఎక్సలెన్స్ (ScOpE)’ పేరిట ఒక ప్రోగ్రాంను తీసుకొచ్చింది. విద్యార్థుల ప్రతిభ, సమస్య పరిష్కార సామర్థ్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్, బయోలజీ, ఇన్ఫర్మేటిక్స్ వంటి సబ్జెక్టుల్లో వారి నైపుణ్యం వంటి అంశాల ఆధారంగా ఒలింపియాడ్ జరుగుతుందనే విషయం తెలిసిందే.
ఈ ఎడ్యుకేషన్ ఇయర్ నుంచే..
‘స్కోప్’ (ScOpE) కార్యక్రమం 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. ఇది అమల్లోకి వస్తే జేఈఈ స్కోర్ అవసరం లేకుండానే ఒలింపియాడ్ విన్నర్స్‌గా నిలిస్తే ఐఐటీలో చేరొచ్చు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు సైతం అవకాశం కల్పించాలన్న ఐఐటీ మద్రాస్ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది కల్చరల్, స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్స్ ఇవ్వడం ప్రారంభించారు.
ఎడిషనల్ సీట్లు: స్కోప్‌లో భాగంగా ఐఐటీ మద్రాస్ (IIT Madras) ప్రతి కోర్స్‌లో అదనంగా రెండు సూపర్‌న్యూమరరీ పోస్టులను క్రియేట్ చేయనుంది. వీటిలో ఒకదాన్ని విద్యార్థినులకు కేటాయిస్తారు. వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉంటాయి. అర్హతలు దాదాపు జేఈఈ తరహాలోనే ఉన్నాయి. 12వ తరగతి పూర్తి చేయాలి. వయసు పరిమితులు ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడూ ఐఐటీలో చేరి ఉండొద్దు. గత నాలుగేళ్లలో కనీసం ఒక్క ఒలింపియాడ్‌లోనైనా పాల్గొని ఉండాలి.
రెగ్యులర్‌గా అడ్మిషన్లు జరిగే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ పోర్టల్ ద్వారా కాకుండా ఒలింపియాడ్ విద్యార్థులను తీసుకుంటామని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. ఐఐటీఎం-స్కోప్ అనే ప్రత్యేక పోర్టల్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర ఐఐటీల కోసం మాత్రం జాయింట్ సీట్ అలకేషన్ పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలి. స్కోప్ ర్యాంక్ లిస్ట్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, ఇన్ఫర్మేటిక్స్‌లో పర్ఫార్మెన్స్ ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఐఐటీ మద్రాస్ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
ఈ కోర్సుల్లో సీట్లు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ డిజైన్, ఫిజిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటాలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఓషియన్ ఇంజినీరింగ్, మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సబ్ కోర్సులు కూడా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఐఐటీ మద్రాస్ పోర్టల్ విజిట్ చేయవచ్చు.