SBI కస్టమర్లకు అలర్ట్‌.. రివార్డ్ పాయింట్స్‌ మెసేజ్‌ వచ్చిందా.. జాగ్రత్త

www.mannamweb.com


నేటి కాలంలో అన్ని ఆన్‌లైన్ చెల్లింపులే అయ్యాయి. రోడ్డుపక్కన చిన్న చిన్న దుకాణాలు మొదలు మాల్స్‌ వరకు కూడా డిజిటల్‌ చెల్లింపులు జరుపుతున్నాం. యూపీఐ పేమెంట్స్‌ అందుబాటులోకి వచ్చాక చేతిలో డబ్బులు వాడటం తగ్గిపోయింది. కూరగాయల దగ్గర నుంచి బంగారం కొనుగోలు వరకు డిజిటల్‌ పేమెంట్సే చేస్తున్నాం. ఇది సైబర్‌ మోసగాళ్లకు మంచి అవకాశంగా మారింది. లాటరీ తగిలిందని.. గిఫ్ట్‌ కార్డ్‌ వచ్చిందని కాల్స్‌ చేసి.. ఏదో విధంగా జనాలను బురిడీ కొట్టించి.. అందిన కాడికి దోచేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా మరో కొత్త తరహా మోసానికి తెర లేపారు సైబర్‌ కేటుగాళ్లు. ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్‌ చేసుకుని.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ పేరిట ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు..

తాజాగా సైబర్‌ నేరగాళ్లు.. ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్‌ చేసి.. మోసాలకు తెర తీశారు. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్స్‌ వాడితే.. రివార్డ్‌ పాయింట్స్‌ వస్తుంటాయి. వాటిని తర్వాత మూవీ టికెట్లు, ఇతర ఈకామర్స్‌ సైట్లలో చేసే షాపింగ్‌కు కూడా వాడుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ యాక్టివేట్‌ అయ్యాయంటూ.. లింక్‌లు పంపుతున్నారు. అది నిజమని నమ్మి.. ఆ లింకుల మీద క్లిక్‌ చేస్తే.. మీ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం.

ఇక తాజాగా ఓ వ్యక్తికి ఇలానే ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ 7,250 రూపాయలు యాక్టీవేట్‌ అయ్యింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బీఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి అంటూ మెసేజ్‌లు పంపించారు. ఆ మెస్సెజ్‌తో పాటు ఎస్‌బీఐ యోనో పేరుతో ఓ లింకును కూడా పంపుతున్నారు. ఇది నిజమని నమ్మి.. దాని మీద క్లిక్‌ చేయడంతో ఆ వ్యక్తి ఖాతా నుంచి ఏకంగా 50 వేలు మాయం అయ్యాయి.

ఈమధ్యకాలంలో ఇలాంటి మెసేజ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. కేవలం ఎస్‌బీఐ కస్టమర్లకు మాత్రమే కాక.. వారి స్నేహితులు, బందువులకు కూడా ఇలా రివార్డ్‌ మెసేజ్‌ లింకులను పంపుతున్నారు. అనుమానం వచ్చి కొందరు తిరిగి సదరు వ్యక్తులకు కాల్‌ చేయగా తాము పంపలేదని తెలిపారు. ఇక కొందరు తొందరపడి ఈ లింక్‌ను క్లిక్‌ చేయడంతో.. సుమారు 50 వేలే రూపాయల వరకు లాస్‌ అయ్యారు. ఈ విషయం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు తెలియడంతో.. వారు ఈ ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్స్‌ పేరిట వస్తున్న సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలానే బ్యాంకు కూడా ఈ తరహా మెసేజ్‌ల గురించి హెచ్చరిస్తోంది. ఇలాంటి లింకులతో మెస్సేజులు వస్తే.. అస్సలు తెరవకూడదని హెచ్చరిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు.