ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు.
ఇక్కడికి ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీతారలు వస్తుంటారు. స్వామి వారి దర్శనం చేసుకుంటారు. తిరుమల వెళ్లే భక్తులకు ఓ ముఖ్య గమనిక. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్లు రేపు విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు.
ఆగస్టు నెలకు సంబంధించిన కోటాను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో శనివారం విడుదల చేయనున్నారు. ఆగస్టులో శ్రీవారి దర్శనంతో పాటు ఇతర సేవల్ని పొందాలనుకునే భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో పాటు పలు రకాల సేవలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈనెల 18న శనివారం ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్తానం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి https://ttdevasthanams.ap.gov.in లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఈ సేవా టికెట్ల కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం పదిగంటలకు అన్లైన్‌లోఅప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్ డిప్‌లో సొమ్ము చెల్లించినవారికి మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు లక్కీడిప్‌లో టికెట్లు మంజూరు చేస్తారు.
ఇతర సేవా టిక్కెట్ల కోటా…
ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటాను కూడా ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడి తెలిపింది. ఆలయంలోని వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను కూడా ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను కూడా ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను కూడా ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు..
ఇక, వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా మే 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల స్వామివారి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు బస కల్పించే కోటాను కూడా ఈనెల 24న విడుదల చేయనున్నారు.
ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు తిరుపతి శ్రీవారి సేవ కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 1 గంటకు పరకామణి సేవ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు వీటిని బుక్ చేసుకునేందుకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను https://ttdevasthanams.ap.gov.inసంప్రదించగలరు.