Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కార్.. అప్పటి నుంచే పెంచిన పెన్షన్‌ అమలు..

Andhra Pradesh: పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ రోజు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. తొలిరోజు ఐదు ఫైన్లపై సంతకాలు చేశారు..


ఇక, ఆ తర్వాత సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు.. గత ప్రభుత్వాన్ని ఎండగడుతూనే.. తన ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను వెల్లడించారు.. ఈ సందర్భంగా పెన్షన్‌ దారులకు శుభవార్త చెప్పారు.. గడచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేస్తామన్న ఆయన.. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత 3 నెలల పెంచిన పెన్షన్‌తో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అన్నారు.. భద్రత, భరోసా ఇచ్చేలా ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు.. చెప్పిన విధంగా హామీలను నిలబెట్టుకుంటూ సీఎం నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసలు కురిపించారు.

గత ఐదేళ్లల్లో జగన్ యువతను గంజాయికి బానిసల్లా చేశారని ఆరోపించిన మంత్రి నిమ్మల… యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేసే ఫైల్‌పై రెండో సంతకం చేశారు. మూడో సంతకం పెన్షన్ల మొత్తాన్ని పెంచే ఫైల్ పై పెట్టారు. నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల ఫైలుపై పెట్టారు. స్కిల్ సెన్సస్ ఫైలు మీద ఐదో సంతకం చేశారని వెల్లడించారు. అయితే, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీకి గతంలో వైఎస్‌ జగన్‌ తెర లేపారు. భూములను దోచుకోవడానికి ల్యాండ్ టైటలింగ్ యాక్టును తెచ్చారు.. అందుకే రద్దు చేశామన్నారు. డాక్యుమెంట్ల మీద.. సర్వే రాళ్ల పైనా జగన్ ఫొటోనే.? అని ప్రశ్నించారు. ప్రైవేటు ఆస్తులను సైతం తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు.. ఇచ్చిన హామీ మేరకు ఆ యాక్టును రద్దు చేస్తూ ఫైలుపై సీఎం సంతకం చేశారని తెలిపారు. ఇక, గడచిన ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్ అమలు చేస్తాం.. జులై ఒకటో తేదీన వృద్ధులకు గత మూడు నెలల పెంచిన పెన్షనుతో కలిపి మొత్తంగా రూ. 7 వేలు ఇస్తాం అని వివరించారు..

మరోవైపు.. మానవత్వం లేని సీఎంగా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు నిమ్మల.. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మాజీ సీఎం జగన్ శాడిస్టిక్ గా వ్యవహరించారు.. కానీ, మానత్వంతో సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభించేందుకు సంతకం చేశారని తెలిపారు. ఇక, యువతకు ఉపాధి కల్పించే ప్రక్రియలో భాగంగా స్కిల్ సెన్సస్ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేశారని వివరించారు. పెన్షన్లను ఇంటింటికి అందిస్తాం. గ్రామ వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అన్నారు.. కొందరు రాజీనామా చేశారు. వలంటీర్ల వ్యవస్థపై త్వరలో సమీక్ష జరుపుతాం.. సచివాలయ వ్యవస్థ వల్ల స్థానిక సంస్థల నిర్వీర్యం కానివ్వం. సచివాలయ వ్యవస్థను స్థానిక సంస్థలతో అనుసంధానిస్తాం అన్నారు. ఇక, శాఖల వారీగా శ్వేత పత్రాలు ఇస్తాం అని ప్రకటించారు మంత్రి నిమ్మల రామానాయుడు.

ఇక, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఐదు సంతకాలు పెట్టారు. జగన్ చెప్పినట్టు ఉద్యోగాల కల్పన చేయలేకపోయారు. జగన్ ఐదేళ్లపాటు విడతల ముఖ్యమంత్రిగా పని చేశారు. అన్నా క్యాంటీన్ల మూసేయడం లేదంటూ నాటి మంత్రి బొత్స సభను పక్క దోవ పట్టించారని మండిపడ్డారు బాల వీరాంజనేయ స్వామి.. మరోవైపు.. మంత్రి సవితమ్మ మాట్లాడుతూ.. ఏపీని చంద్రబాబు స్వర్ణాంధ్రగా మారుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. యువతను నిర్వీర్యం చేసేలా గత ఐదేళ్ల పాలన నడిచింది. జగన్ పాలనలో సామాన్య రైతుల నుంచి ల్యాండ్ లార్డ్స్ కూడా భయపడేలా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చారు. పాలన చేతకాని జగన్.. అన్నా క్యాంటీన్లను కూడా మూసేశారని మండిపడ్డారు మంత్రి సవితమ్మ.