ఏపీ మాజీ సీఎం జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ కే.రవిచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు జగన్ కు ఆయన లేఖ రాశారు. తనకు పార్టీ పదవితో పాటు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఆయన పార్టీకి ఎందుకు రాజీనామా చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన రవిచంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పని చేశారు.
మీడియా ఛానల్స్ లో చర్చల్లో పాల్గొని పార్టీ వాణిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాన్న పేరు ఆయనకు ఉంది. అయితే.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ ఆయనకు పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ పదవితో పాటు అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించారు. అనంతరం ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గానూ నియమించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి నాటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, రవిచంద్రారెడ్డి ఏ పార్టీలో చేరుతారు? అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. తాను గతంలో పని చేసిన కాంగ్రెస్ లో చేరుతారా? లేక కూటమిలోని ఏదో ఓ పార్టీలో చేరుతారా? అన్న అంశంపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ రోజు లేదా రేపు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి చేరబోయే పార్టీని ప్రకటించే అవకాశం ఉంది.
































