ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, వారికి 10 వేల ఉచిత ఇళ్లు

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడిన చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.


భద్రచలం, ఉట్నూరు, మున్ననూరు, ఏటూరు నాగరం ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ నియోజకవర్గాలకు అదనంగా 500-700 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. చెంచుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని స్పష్టం చేశారు.

చెంచుల కలసాకారం

తరతరాలుగా సొంత ఇండ్లకు నోచుకోని గిరిజన తెగలలోకి అత్యంత బలహీన వర్గమైన చెంచుల సొంతింటి కలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాకారం చేయబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

నాలుగు ఐటీడీఏల్లో

రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్‌, ఏటూరు నాగారం నాలుగు ఐటీడీఏల పరిధిలో సచ్యురేషన్ పద్ధతిలో దాదాపు 10 వేల చెంచు కుటుంబాలను గుర్తించి వీరందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.

సీఎం, గవర్నర్ సూచనలతో

ఇందిరమ్మ ఇండ్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందర్భాలలో సూచించారని, అలాగే సీఎం రేవంత్ రె కూడా అనేక సందర్భాలలో గిరిజన ప్రాంతాలలో అభివృద్ది, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మాణంపై అనేక సూచనలు చేశారన్నారు.

గవర్నర్, ముఖ్యమంత్రి సూచనలు సలహాల మేరకు గిరిజన ప్రాంతాల్లో చెంచులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు.

అడవి బిడ్డలకు ఇందిరమ్మ ఇళ్లు

“అడవులను నమ్ముకొని జీవించే గిరిజనులలో చెంచులు ఒక జాతి, వీరు అడవుల్లో వేటాడటం, అటవీ ఫలసాయం సేకరించి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.

చిన్నచిన్న గుడిసెలు తప్ప వీరికి పక్కా ఇల్లు ఎలా ఉంటుందో ఊహకు అందని విషయం. ఆ అడవి ప్రాంతాల్ని వదలి వారు బతక లేరు. అందుకే వీరు జీవించే ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన కూడా చేయలేదు” – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇండ్ల మంజూరు ఇలా

ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో

  1. ఆసిఫాబాద్ -3551,
  2. బోధ్ -695,
  3. ఖానాపూర్ -1802,
  4. సిర్పూర్- 311,
  5. ఆదిలాబాద్- 1430,
  6. బెల్లంపల్లి- 326,

భద్రాచలం ఐటీడీఏ పరిధిలో

  1. అశ్వరావుపేట -105,

మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్ట్ లో

  1. అచ్చంపేట్ -518,
  2. మహబూబ్‌నగర్- 153,
  3. పరిగి- 138,
  4. తాండూర్- 184

మొత్తం 9,395 ఇండ్లను మంజూరు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

గిరిజన నియోజకవర్గాలకు అదనంగా

ఈ ఏడాది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, అయితే ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లకు గాను 20 శాతం ఇండ్లను బఫర్ కింద పెడుతున్నామన్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో

పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. పట్టణంలోని ముఖ్య ప్రాంతాలలోని మురికి వాడల్లో జీవనం కొనసాగిస్తున్న పేదలు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నారని, హైదరాబాద్ కు దూరంగా ఇండ్లు నిర్మించి ఇస్తే తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు.

జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్మెంట్లు

గత ప్రభుత్వం కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి హైదరాబాద్‌లో ఉన్న పేదలకు కేటాయిస్తే వాటిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ప్రాంతంలోనే జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.