ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. ఆదరణ-3 పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని.. ప్రభుత్వం పథకం అమలు చేసేందుకు రూ.1,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
గొల్లపూడిలోని బీసీ భవన్‌లో వివిధ బీసీ కుల కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ‘ఆదరణ-3’తో పాటు ఇతర బీసీ పథకాల అమలు తీరుపై కూడా సలహాలు, సూచనలు స్వీకరించారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారికి ఆధునిక యంత్రాలు, పరికరాలు ఇవ్వడం ద్వారా వారి ఆదాయం పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. దీనివల్ల వారు మరింత మెరుగైన పనితనాన్ని కనబరిచి, ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.
ఆదరణ-3 పథకం ద్వారా చేతి, కుల వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందించి ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము అన్నారు మంత్రి సవిత. ఈ పథకం అమలులో కార్పొరేషన్ల పాత్ర కీలకం అని, వారి పర్యవేక్షణలోనే పథకం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ వర్క్‌షాప్ మూడు రోజులపాటు కొనసాగుతుందని.. ఇందులో పాల్గొనే ఛైర్మన్లందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ‘ఆదరణ-3’ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆదరణ-3 పథకం ద్వారా వృత్తిదారులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. బీసీ పథకాలను కార్పొరేషన్ ఛైర్మన్ల ఆధ్వర్యంలోనే కొనసాగిస్తామన్నారు మంత్రి.
ఈ ఆదరణ-3 పథకంలో కులవృత్తిదారులకు ఎంతో మేలు జరుగుతుంది. తమ పనికి అవసరమైన, నాణ్యమైన పరికరాలను వారే ఎంచుకోవచ్చు. ఇది వారి ఉత్పాదకతను పెంచడానికి సహాయపడుతుంది. గతంలో, ప్రభుత్వం ఎంపిక చేసిన పరికరాలను లబ్ధిదారులు స్వీకరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, ఆదరణ-3లో లబ్ధిదారుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆదరణ-2 పథకంలో 90 శాతం రాయితీతో పరికరాలు అందజేసేవారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని లబ్ధిదారులే చెల్లించాల్సి వచ్చేది. గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలను, పరికరాలను ఇస్తామని గతంలో మంత్రి సవిత ప్రకటించారు. ఒకవేళ బైక్ తీసుకుంటే.. బైక్ ధర రూ.లక్ష ఉంటే.. అందులో కేవలం రూ.10వేలు కడితే చాలు. ఉదాహరణకు రూ.10వేల వస్తువుకు రూ.వెయ్యి కడితే చాలు. గీత కార్మికులకు మూడు స్లాబులలో లోన్ అందించే సౌకర్యం కూడా ఉంటుంది. రాష్ట్రంలో ఆయ కులవృత్తుల్లో వారు చేసే పనుల్ని బట్టి ఈ పరికరాలను అందించనుంది ప్రభుత్వం.
ఆదరణ-3 పథకంలో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ పథకం ద్వారా కులవృత్తులు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు. నకిలీ మద్యం కేసుపై మంత్రి సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై వైఎస్సార్‌సీపీ సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందని.. బాబాయి హత్యకేసుపై సీబీఐ దర్యాప్తును ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు.

































