YS Viveka Murder Case- కడప: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. చిన్నాన్న వివేకాను హత్య చేసిన వారికి టికెట్లు సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారని షర్మిల (YS Sharmila), సునీత పలుమార్లు వ్యాఖ్యానించారు.
నేరస్తులను అసెంబ్లీ, పార్లమెంట్ లకు పంపించవద్దంటూ సైతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో కడప కోర్టులో వైఎస్ షర్మిల, సునీతలకు ఎదురుదెబ్బ తగిలింది.
వివేకా కేసుపై మాట్లాడొద్దు..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావించరాదని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. బాబాయ్ వివేకా కేసుపై ప్రచారం చేయకూడదని కడప కోర్టు సునీత, షర్మిలను ఆదేశించింది. దాంతో కడప కోర్టు ఆర్డర్ను డిస్మిస్ చేయాలని హైకోర్టులో వివేకా కుమార్తె డాక్టర్ సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఆపై సునీత పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కడప కోర్టులోనే తేల్చుకోవాలని వారికి హైకోర్టు సూచించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న కడప కోర్టు.. షర్మిల, సునీత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిలకు రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు. జిల్లా లీగల్ సెల్కు జరిమానాను కట్టాలని సూచించింది.