ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూలు!? నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి

www.mannamweb.com


ఫిబ్రవరి మూడో వారంలో
ఎన్నికల షెడ్యూలు!?
ముమ్మరమవుతున్న కసరత్తు
ఓటర్ల తుది జాబితా విడుదల
నెలాఖరులోపు బదిలీల ప్రక్రియ పూర్తి

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వచ్చే నెల మూడోవారంలో వెలువడే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల షెడ్యూలు 2019 మార్చి 10వ తేదీన వెలువడింది. ఈసారి అంతకంటే కొన్ని రోజుల ముందే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. సోమవారం తుది ఓటర్ల జాబితా కూడా విడుదలైంది. ఇక… జిల్లా, రాష్ట్ర స్థాయిలో మూడేళ్లకంటే ఎక్కువకాలం ఒకేచోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేయడానికి సంబంధించి గడువు కూడా విధించారు. జిల్లాల్లో ఈనెల 25వ తేదీలోపే అలాంటి అధికారులను బదిలీ చేయనున్నారు. ఇక… మూడేళ్లు దాటిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా స్థాయి కీలక అధికారులను ఈనెలాఖరుకు బదిలీ చేస్తారు. రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ ఆఫీసర్ల జాబితా తయారీ ప్రక్రియ మంగళవారం మొదలవుతోంది. ఈ జాబితాను సిద్ధం చేసి… కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది.ఇక… ఇంకు నుంచి ఈవీఎంల దాకా పోలింగ్‌ ప్రక్రియకు 17 రకాల వస్తువులు అవసరమవుతాయి. వాటి సేకరణకు కూడా రంగం సిద్ధమవుతోంది. ఇలా అధికారుల వైపు నుంచి ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కనీసం 3 వారాల సమయం అవసరం. బీజేపీకి సంబంధించి… అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠతో ఒక కీలక ఘట్టం ముగిసింది. పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 9వ తేదీతో ముగుస్తాయి. 1వ తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో 3 రాష్ట్రాలూ ‘బడ్జెట్‌’ ప్రక్రియను దాదాపు ఇదే సమయంలో ముగించనున్నాయి. అటు అధికారులు, ఇటు ప్రభుత్వ స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన తర్వాత… ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల షెడ్యూలును వెలువరించే అవకాశముంది. గతంలో దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్‌ జరిగింది. సహజంగా… అక్షరక్రమం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తొలివిడతలోనే పోలింగ్‌ జరుగుతుంది.