పేదలకు ఇళ్ల పంపిణీ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..!!

ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు.


పేదలకు ఇళ్ల పంపిణీ పైన ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇల్ల పంపిణీకి సంబంధించి నిర్దిష్ఠ కార్యాచరణ.. కాల పరిమితి పైన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం..పంపిణీ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయే 100 రోజుల్లో లక్షా 28వేల ఇళ్లు పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు మంత్రి పార్థసారధి చెప్పారు.రాష్ట్రంలో 8లక్షల 4వేల705 ఇళ్లు వివిధ దశలో ఉండగా.. 5లక్షల 76వేల 670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు మంత్రి పార్థసారధి. కనుక రాబోయే వంద రోజుల్లో లక్షా28 వేల ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

మార్చి నెల నాటికి రాష్ట్రంలో 7 లక్షల ఇళ్లు కట్టి పూర్తి చేయాలనేది తమ లక్ష్యమని వివరించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కాకుండా పక్కదారి పట్టించారనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వీటి పైన విచారణ చేసి అధికారికంగా వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎక్కడైతే ఇసుక సమస్య ఉందో..అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఇళ్లను నిర్మించేందుకు ముందుకు వచ్చినా లాభదాయకంగా ఉన్న వరకూ పూర్తి చేసి తర్వాత వదిలేసిన పరిస్థితి గుర్తించామని చెప్పారు. ఇటువంటి కంపెనీలపై జులై 31లోపు ఎంక్వైరీ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు మంత్రి. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇళ్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామన్నారు. మూడు నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేసారు.