ఆడుదాం ఆంధ్రాపై విచారణకు ఏపీ ప్రభుత్వం

వైసీపీ హయాంలో నిర్వహించినటువంటి ఆడుదాం ఆంధ్రాపై విచారణకు ఏపీ ప్రభుత్వం (AP Govt) ఆదేశించింది. ఏసీబీ (ACB) విచారణకు ఏపీ సర్కార్ ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో జరిగిన అవకతవకలు, ఆరోపణలన్నింటిపై కూడా సమగ్ర విచారణ జరుగబోతోంది.


ఏపీలో ఎన్నికలకు ముందు యువ ఓటర్లను టార్గెట్ చేస్తూ ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం కింద దాదాపు రూ.119 కోట్లలో 45 రోజుల్లోనే ఖర్చు చేశారు. దీనికి సంబంధించి నిన్న (సోమవారం) శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు ప్రశ్నించగా.. దానికి క్రీడాశాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad) సమాధానం ఇచ్చారు.

కేవలం 45 రోజుల్లో రూ.119 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కేవలం రూ.119 కోట్లే కాదు అంతకుమించి దీంతో కుంభకోణం జరిగిందిని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాదాపు రూ.400 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని, కేవలం రూ.119 కోట్లకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర ఖర్చు మాత్రమే కాదు జిల్లా ఫండ్స్‌ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఖర్చు చేశారనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ స్కామ్‌పై సమగ్రమైన విచారణ జరపించాలని ఎమ్మెల్యేలు గౌతు శిరీష, భూమా అఖిలప్రియ కోరారు.

దీనిపై వెంటనే స్పందించిన సర్కార్ ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ విచారణ చేసి ఆడుదాం ఆంధ్రాలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకునేలా సిఫారసు చేస్తారని సమాచారం. ఆడుదాం ఆంధ్రాలో అనే కార్యక్రమం పెట్టి భారీ ఎత్తు ఖర్చుల చేశారని, అంతే కాకుండా క్రీడాకారులను అపహాస్యం చేశారని, ఎన్నికలకు ముందు యువతను ప్రలోభపెట్టే విధంగా ఈ క్రీడా సంబరం నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ముగింపు కార్యక్రమానికి రెండు కోట్లు కేటాయించి.. తర్వాత ఆఖరి నిమిషానికి మరో మూడు కోట్లు పెంచినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో కేవలం 45 రోజుల్లో విలువైన ప్రజాధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని అనే అనుమానాలను శాసనసభలో సభ్యులు వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు మంత్రి కూడా సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్రాలో భారీ ఎత్తున ఖర్చు చేశారని, కిట్ల రూపంలో నాశిరకమైన సరుకులను కొనుగోలు చేసి కమిషన్లు కొల్లగొట్టారనే అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో మంత్రిగా పనిచేసిన రోజాపై కూడా అనేక అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఏసీబీ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏసీబీ రిపోర్టు వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.