అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం మంగళవారం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వీరి స్థానాల్లో వేరే అధికారులను నియమించేందుకు వీలుగా, ఒక్కో పోస్టుకు ముగ్గురేసి ఐపీఎస్ అధికారుల పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్యానల్ సమర్పించాలని సీఎస్ జవహర్‌రెడ్డికి ఆదేశాలు జారీచేసింది. నిఘా విభాగాధిపతి పోస్టు కోసం అదనపు డీజీ, అంతకంటే ఎక్కువ హోదా కలిగిన అధికారుల వివరాల్నే పంపాలని స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వం పంపిన ప్యానెల్‌ను పరిశీలించిన అనంతరం ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన అధికారులు గురువారం ఉదయంలోగా బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఏపి ఇంటెలిజెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన కుమార్ విశ్వజిత్ ప్రస్తుతం అదనపు డీజీ ర్యాంకులో ఉన్నారు. ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుపై వేటు వేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవాలని కుమార్ విశ్వ జిత్‌కు ఆదేశాలు ఇచ్చారు. గురువారం ఉదయం 11 గంటల్లో గా బాధ్యతలు తీసుకున్న కంప్లేయన్స్ నివేదికను పంపాలని ఈసీ సూచించింది. మరోవైపు విజయవాడ సీపీగా 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పీహెచ్‌డీ రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తక్షణం సీపీగా బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసింది.