Gold Prices: రూ. 2 లక్షలకు చేరనున్న తులం బంగారం ధర.. మహిళలకు పెద్ద షాక్.. ఎప్పటి వరకో తెలుసా?

Gold Investments: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలు వంటి కారణాల వల్ల బంగారం ధర గత నెల రోజులుగా విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ. 74 వేల మార్కు కూడా ఇటీవల దాటేసింది. అయితే బంగారంపై ఇన్వెస్ట్ చేసే వారికి మాత్రం ఇది శుభవార్తేనని చెప్పొచ్చు. వారికి రేటు పెరిగితేనే మంచి రిటర్న్స్ వస్తాయి మరి. అందుకే చాలా మంది గోల్డ్‌ను సురక్షిత పెట్టుబడిగా చెబుతుంటారు. గత 3 రోజులుగా బంగారం రేటు తగ్గినా ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి.
ఇండియా బులియెన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం స్వచ్ఛమైన 24 క్యారెట్స్ పసిడి రేటు ఇటీవలే రూ. 74 వేల మార్కును దాటింది. 2015లో బంగారం రేటు రూ. 24,740 వద్ద ఉండగా.. 9 సంవత్సరాలలో రేటు ట్రిపుల్ (మూడింతలు) అయిందని చెప్పొచ్చు.


అంతకుముందు 2006లో బంగారం రేటు రూ. 8250 గా ఉండగా.. మూడింతలు అయ్యేందుకు 9 సంవత్సరాల కంటే ఎక్కువ పట్టింది. అంతకుముందు చూస్తే 1987లో రూ. 2570 గా ఉండగా.. 19 సంవత్సరాల్లో మూడింతలు అయింది. ఇంకా అంతకుముందు చరిత్ర చూసినట్లయితే రేటు మూడింతలు అయ్యేందుకు వరుసగా 8, 6 సంవత్సరాలు పట్టింది.

ఇక ప్రస్తుత బంగారం ధర రూ. 74 వేల లెక్కన చూస్తే.. మూడింతలు అయితే రేటు రూ. 2 లక్షల మార్కు దాటేస్తుంది. అయితే పసిడి ప్రియులు, బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి.. ఇప్పుడు రేటు ట్రిపుల్ అయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందనే ప్రశ్న మదిలో మెదులుతుంటుంది.

LKP సెక్యూరిటీస్‌ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది దీని గురించి విశ్లేషించారు. ప్రపంచంలో ఏ మూలనైనా తీవ్ర ఉద్రిక్తతలు లేదా అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం రేట్లు ఎక్కువగా పెరుగుతుంటాయని ఆయన చెప్పారు. ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి మార్పుల్ని బంగారం రేట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. ఇది కొన్ని సార్లు ఎక్కువగా, కొన్నిసార్లు తక్కువగా పెరగొచ్చని అన్నారు.

3.3 సంవత్సరాలలో బంగారం ధర రూ. 40 వేల నుంచి రూ. 70 వేలకు అంటే 75 శాతం పెరిగిందని.. అంతకుముందు 2014లో రూ. 28 వేల నుంచి 2018లో రూ. 31,250 వరకు అంటే కేవలం 12 శాతం మాత్రమే పెరిగిందని ఉదహరించారు. ఇక త్రివేది కూడా ప్రస్తుత ట్రెండ్స్‌ను కొట్టి పారేయలేం అని.. దీని ప్రకారం 7 నుంచి 12 సంవత్సరాలలో బంగారం రేటు రూ. 2 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు.

>> రంజాన్ తర్వాత, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తత, చైనా- తైవాన్ ఘర్షణ వంటివి కూడా అనిశ్చితి సృష్టించే అవకాశం ఉందని ఐబీజేఏ నేషనల్ సెక్రటరీ సురేంద్ర మెహ్తా చెప్పుకొచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే.. బంగారం రేట్లు అనిశ్చితి కారణంగా మరో 6 సంవత్సరాల్లోనే దాదాపు 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
>> ఇక నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ మేనేజర్ విక్రమ్ ధావన్ మాత్రం.. 19 ఏళ్లలో బంగారం రేటు 3 రెట్లు పెరిగిందనడానికి ఒకే ఒక ఉదాహరణగా ఉందని.. ఇన్వెస్టర్లలో బంగారానికి మంచి డిమాండ్ ఉందని, దీంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొన్నేళ్లలోనే అద్భుత రిటర్న్స్ అందుకోవచ్చని చెప్పారు. దీని ప్రకారం.. పలువురు నిపుణులు బంగారం ధర 3 రెట్లు పెరిగేందుకు కనీసం 7 నుంచి 12 ఏళ్లు పట్టొచ్చని అనుకుంటున్నారు.