వైఎస్ షర్మిల కు ఏపీ పీసీసీ పగ్గాలు..మూహూర్తం ఫిక్స్..?

www.mannamweb.com


YS Sharmila: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల త్వరలో ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ ఏ భాద్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఇప్పటికే షర్మిల పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన వైఎస్ షర్మిలకు త్వరలో పీసీసీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించినట్లు సమాచారం.
ఈ నెల 17వ తేదీన మధుసూధన్ మిస్త్రీ ఆధ్వర్యంలో ఏపీ లో లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈలోపుగానే షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 15 నుండి 20 అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. సొంతంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చే పరిస్థితి లేకపోయినా 15 – 20 స్థానాలు గెలుచుకుంటే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చని ఆ దిశగా పని చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఓ పక్క వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం, వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఏపీ నేతలు కొప్పుల రాజు, రఘువీరారెడ్డి, జేడీ శీలం, వైఎస్ షర్మిల తదితరులు మణిపూర్ కు వెళ్లారు. ఇతక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎల్పీ నేతలు, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ అఫీసు బేరర్లు కూడా మణిపూర్ సభలో పాల్గొన్నారు.