రైతులకు AP సర్కార్ గుడ్ న్యూస్

www.mannamweb.com


ఏపీలో రైతులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యానికి చెల్లించాల్సిన బకాయిలను వదిలేసి వెళ్లిపోయింది. వాటిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది.

ఇందుకోసం తొలి విడతగా రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు. ఈ మొత్తంలో జిల్లాల వారీగా వాటాను కూడా ఆయన వివరాలతో సహా ప్రకటించారు.

ముందుగా ధాన్యం ఎవరి వద్ద సేకరించారో గుర్తించి ప్రణాళికాబద్దంగా ఈ బకాయిలు చెల్లిస్తామని మనోహర్ తెలిపారు.ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.565.95 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.121.96 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.163.59 కోట్లు, కాకినాడ జిల్లాకు రూ.21.92 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.19.96 కోట్లు, బాపట్ల జిల్లాలో రూ.6.61 కోట్ల చొప్పున చెల్లించనున్నట్లు మనోహర్ వెల్లడించారు.

సుమారు 50 వేల మంది రైతులకు ఉపశమనం కలిగేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రైతులకి మిగిలిన బకాయిలు కూడా కొద్ది రోజుల్లో చెల్లిస్తామని మనోహర్ వెల్లడించారు. దీంతోపాటు మరో రూ.2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి కూడా ఇటీవలే చెల్లించినట్లు ఆయన గుర్తుచేశారు. వచ్చే మార్చి 31 నాటికి మరో రూ. 10 వేల కోట్లు బకాయిలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బ్యాంకుల నుంచి కూడా ఈ మేరకు సహాయం కోరుతున్నట్లు పేర్కొన్నారు.

పేదల పొట్ట కొట్టి, కోట్లు దోచుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని మంత్రి హెచ్చరించారు. ప్రతి జిల్లాలో తనిఖీలు చేపట్టి బియ్యం మాఫియాను నిర్మూలిస్తామని అన్నారు. గత అరాచక పాలనలో రైతులు చితికిపోయారని, రైతుల నుంచి సేకరించిన ఆహారధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు.