AP Speaker: ఆంధ్రప్రదేశ్ లోటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కొలువుతీరబోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రాబునాయుడుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
ఇప్పటికే మంత్రులుగా ఎంపికైన వారి లిస్ట్ అందుబాటులోకి వచ్చింది. అయితే, అందులో కొందరు సీనియర్లకు స్థానం దక్కలేదు. దీంతో ఇప్పుడు వారికి ఎటువంటి అవకాశం కల్పిస్తారు అనేదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి వీరిలో ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. సీనియర్లలో స్పీకర్ పదవి కోసం రేసులో ఉన్నట్టుగా ముఖ్యంగా ఐదుగురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఆ ఐదుగురు..
AP Speaker: అయ్యన్న పాత్రుడు, కాలువ శ్రీనివాసులు, కొణతాల రామకృష్ణ, పితాని సత్యనారాయణ, బుచ్చయ్య చౌదరి స్పీకర్ పదవికి రేసులో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వీరిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు ఇద్దరూ ఏడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలలో చంద్రబాబు తరువాత వీరిద్దరే సీనియర్లని చెప్పవచ్చు. దీంతో ఈ ఐదుగురిలోనూ వీరిద్దరి మధ్యే స్పీకర్ పదవికి పోటీ ఎక్కువ ఉన్నట్టు చెబుతున్నారు. ఇక కొణతాల రామకృష్ణ జనసేననుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేనకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో సహా ముగ్గురికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో కొణతాలకు స్పీకర్ పదవి వస్తుందా అనేది అనుమానమే అని చెప్పవచ్చు. ఇక మిగిలిన వారిలో పితాని సత్యనారాయణ గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాల్వ శ్రీనివాసులు కూడా మొదటి నుంచి టీడీపీతో కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచే స్పీకర్ పదవి ఇవ్వాలి అనుకుంటే కనుక సీనియార్టీ దృష్ట్యా అయ్యన్న పాత్రుడు.. బుచ్చయ్య చౌదరిలలో ఎవరికైనా ఇవ్వాలి. లేదూ వేరే సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటే కాల్వ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణాల్లో ఎవరికైనా ఛాన్స్ దక్కొచ్చు. ఈ నలుగురిలో ఎవరిని స్పీకర్ చేసినా.. కొణతాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయా పరిశీలకులు చెబుతున్నారు.
అలా అయితే..
AP Speaker: కేంద్రంలో స్పీకర్ పదవి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే, అక్కడ పురంధేశ్వరికి ఆ పదవి దక్కొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుంచి ఒక్కరికే మంత్రి పదవి దక్కింది. బీజేపీకి రెండు పదవులు ఇస్తారని ముందు నుంచి ప్రచారంలో ఉన్నా.. చివరి నిమిషంలో ఆ ప్రతిపాదన ఆగిపోయింది. ఇప్పుడు బీజేపీ కూడా స్పీకర్ పదవిని కోరుతోందని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద చూస్తే.. ఏపీలో మంత్రి పదవుల కంటే క్లిష్టంగా స్పీకర్ ఎంపిక మారిందని చెబుతున్నారు విశ్లేషకులు.