ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్య

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. పట్టణంలోని ఎగువకురవవంకకు చెందిన దొరస్వామి (62)ని దుండగులు చంపారు.


కురవవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో దొరస్వామి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం భార్య మృతిచెందడంతో కుమార్తె హరితతో కలిసి ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతిచెందారు.

సమాచారం అందుకున్న మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ వలీబ్‌ బసు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లోనే కుమార్తె ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమార్తెను పోలీసులు విచారిస్తున్నారు.