ఏపీలో అమరావతి రాజధానికి హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఐదేళ్లుగా మూలనపడిన అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమవుతున్న వేళ.. తన వంతుగా ఏం చేస్తారో ఆయన చెప్పేశారు. ఇవాళ హైదరాబాద్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో అంకాలజీ యూనిట్ ప్రారంభించిన బాలయ్య.. తన మనసులో మాట చెప్పేశారు.
అమరావతి రాజధానిలో గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అప్పట్లో వారితో చేసుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోవడం, ఇందులో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో తిరిగి వారిని తీసుకొచ్చేందుకు అధికారుల స్ధాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాను ఛైర్మన్ గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేందుకు గతంలో బాలయ్య అంగీకరించారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గతంలో స్థలాలు కేటాయించిన సంస్థలతో సంప్రదింపులు జరిపి వారితో తిరిగి ఆయా సంస్థలు పెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బాలయ్యను కూడా సంప్రదించి ఆయన సారధ్యంలో నడుస్తున్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి బ్రాంచ్ ను అమరావతిలో పెట్టేలా ఒప్పించారు. దీంతో 8 నెలల్లో అమరావతిలో ఈ ఆస్పత్రి బ్రాంచ్ ఏర్పాటు చేస్తానని బాలయ్య ఇవాళ హైదరాబాద్ లో ప్రకటించారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా పేదలకు చౌకగా వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.