Bamboo Rice: ఈ బియ్యం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి ఏ చెట్టునుండి లభిస్తాయో తెలుసా..

www.mannamweb.com


దక్షిణ భారతదేశంలో రైస్ ను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. రోజంతా ఏమి తిన్నా అన్నం తినకపోతే మాత్రం ఏదో లోటుగా కనిపిస్తోంది. అయితే రైస్ ఎక్కువ తింటే మధుమేహం వ్యాధి బారిన పడతారని అంటుంటారు.
అయితే వెదురు బియ్యం తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. వెదురు బియ్యం చాలా అరుదైన బియ్యం రకం. ఇందులో పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. చాలామందికి వైట్ రైస్ గురించి తెలుసు. అలాగే బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అని రకరకాలు ఉన్నా, అవన్నీ వరి నుంచి వచ్చిన ధాన్యాలే. కానీ వెదురు రైస్ గురించి చాలామందికి తెలియదు. బాంబో చికెన్ అంటే వెదరు బొంగులో వండే చికెన్ ను బాంబో చికెన్ అంటారు. మరి వెదురు బియ్యం అంటే వెదురు బొంగుల్లో వండే రైస్ కాదు. నేరుగా వెదురు చెట్టుకే పండే రైస్ ను వెదురు బియ్యం అంటారు. వెదురు బియ్యాన్ని ములయారి రైస్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా వెదురు చెట్టు వయసు చివరి దశకు వచ్చి, అది చనిపోయేటపుడు కొత్త చెట్లు మొలకెత్తడానికి పెద్ద మొత్తంలో పుష్పించడం,విత్తనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. వెదురు కంకులు ఉద్భవిస్తాయి. ఈ వెదురు కంకులను కోసి తీస్తే అందులో విత్తనాలు బయటకు వస్తాయి, ఇలా తీసిన విత్తనాలనే వెదురు బియ్యం అంటారు. ఈ వెదురు బియ్యం చాలా అరుదుగా దొరుకుతాయి. వీటి ఉత్పత్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వెదురు చెట్టు జీవితకాలం ముగియటానికి కొన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. అప్పటికి గానీ ఆ చెట్టు వెదురు కంకులను ఉత్పత్తి చేయదు. అందుకే వెదురు బియ్యం చాలా అరుదుగా దొరుకుతాయి.

వెదురు బియ్యం చూడటానికి మామూలు వరి నూకల బియ్యం లాగా ఉంటుంది. అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని మామూలు బియ్యంలాగే వండుకోవాలి. వండిన తర్వాత దాని ఆకృతిలో తేడా ఉంటుంది. ఈ బియ్యంతో వండిన అన్నం కొద్దిగా జిగటగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. రుచిలో గోధుమ ధాన్యాల రుచిని కలిగి ఉంటుంది,తియ్యగానూ ఉంటుంది. ఈ బియ్యంను కిచిడి చేయటానికి లేదా ఖీర్ చేయటానికి ఎక్కువుగా ఉపయోగిస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు

అరుదైన రకానికి చెందిన వెదురు బియ్యంలో పోషకాలు, ఔషధ గుణాలు ఎక్కువుగా ఉంటాయి. వీటిలో మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. ఈ బియ్యం వండుకొని తింటే వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు నయమవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇది మేలు చేస్తుంది. విటమిన్ లోపం ఉన్న గర్భిణులకు ఈ వెదురు బియ్యం ఆరోగ్యకరం. ఈ బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడంతో పాటు షుగర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెదురు గింజల్లో ఎలాంటి కొవ్వు ఉండదు. ఇప్పటికే ఉన్న శరీర కొవ్వును కరిగించడానికి దోహదపడుతుంది. అదనంగా ఈ బియ్యంలో ఐరన్, ఫాస్పరస్ వంటి మూలకాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెదురుబియ్యం రక్తపోటును నియంత్రిస్తుంది, వెదురు బియ్యం స్థిరంగా తీసుకోవడం వల్ల రక్తపోటు సాధారణ పరిధిలోకి వస్తుంది. మెదడుకు సరైన పోషకాలు అందించి, మెదడును, గుండెను సమన్వయ పరుస్తుంది. వెదురు బియ్యం తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, భాస్వరం, ఇనుము వంటి మూలకాలతో పాటు ఫ్లేవనాయిడ్‌లు, ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. ఈ బియ్యంలోని బయోయాక్టివ్ పదార్థాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు కీళ్లవాపును తగ్గిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన బి విటమిన్లు, ముఖ్యంగా బి6 వెదురు బియ్యంలో పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాల సంశ్లేషణ,నరాల ఆరోగ్యం, అభిజ్ఞా పెరుగుదలకు ఇవి మంచివి. రక్తహీనత, మూర్ఛలు, అల్జీమర్స్ వంటి అనారోగ్యాలను నివారిస్తాయి. దంత క్షయాలు లేదా కావిటీలను నివారించడంలో సహాయపడే పోషకాలు వెదురు బియ్యంలో ఉంటాయి.

ఈ వెదురు బియ్యం సాధారణంగా మార్కెట్లో లభించవు. కేరళలోని కొండప్రాంతాలు, వెదురు బొంగులు ఎక్కువగా ఉండే అభయారణ్యాల ప్రాంతాలలో నివసించే గిరిజనుల వద్ద ఈ బియ్యం అరుదుగా లభిస్తాయి.