ఆమె ప్రభుత్వ పాఠశాలలో.. తెలుగు మాధ్యమంలో చదువుకున్నారు. కార్పొరేట్ స్కూల్లో పాఠాలు చెప్పేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంగ్లంపైన పట్టులేదని అవకాశం రాలేదు. ఆ అనుభవమే ఆమె పట్టుదలను మరింత పెంచింది. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించేలా చేసింది.
ఆమె ప్రభుత్వ పాఠశాలలో.. తెలుగు మాధ్యమంలో చదువుకున్నారు. కార్పొరేట్ స్కూల్లో పాఠాలు చెప్పేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంగ్లంపైన పట్టులేదని అవకాశం రాలేదు. ఆ అనుభవమే ఆమె పట్టుదలను మరింత పెంచింది. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించేలా చేసింది. ఆపై యూట్యూబ్‌లో ఉపాధ్యాయులకు నైపుణ్యాల మెరుగుపైన వీడియోలు చేస్తున్నారు ఏలూరుకు చెందిన జయలక్ష్మి.
ఇంటర్ తర్వాత పెళ్లి చేయడంతో జయలక్ష్మి చదువు అర్ధంతరంగా నిలిచిపోయింది. కానీ ఆమెకు చదువంటే ప్రాణం. పెళ్లి తర్వాత చదువుకునేందుకు అతి కష్టంమీద భర్త ఉమామహేశ్వరరావును ఒప్పించారు. చదువు ఆపేసిన ఏడేళ్ల తర్వాత దూరవిద్యలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఇంగ్లిష్ చేశారు. బీఈడీ సైతం పూర్తిచేశారు. ప్రైవేటు పాఠశాలల్లో టీచర్‌గా పని చేశారు. ప్రారంభంలో ఆంగ్లంలో పాఠాలు చేప్పేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. 40 నిమిషాల క్లాసు చెప్పేందుకు రాత్రంతా సన్నద్ధమయ్యేవారు. అర్థాలు తెలుసుకునేందుకు నిఘంటువుతో కుస్తీ పడేవారు. కార్పొరేట్ స్కూళ్లలో చేరేందుకు ప్రయత్నిస్తే ఆంగ్లంపైన పట్టు సరిపోదని తిరస్కరించేవారు. అప్పట్నుంచీ తనను తాను మెరుగుపర్చుకుంటూ వచ్చిన జయలక్ష్మి.. తర్వాత కాలంలో తనే సొంతంగా పాఠశాలను ప్రారంభించారు.
అనతికాలంలోనే ఆదరణ
ఆ క్రమంలో ఆమెకు మరో ఆలోచనా వచ్చింది. కొత్తగా బోధన రంగంలోకి వచ్చేవారు ఒకప్పటి తనలా ఇబ్బందులు పడుతున్నారని అర్థమైంది. దాంతో ఆంగ్లంపై పట్టుసాధించేందుకు ‘మైటీచింగ్
స్టైల్’ యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఇందులో ఇంటర్య్వూలకు సిద్ధం కావటం మొదలు, ప్రాథమిక దశలో బోధనలో ఎదురయ్యే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. సరళంగా ఆంగ్లం ఎలా బోధించాలో చెబుతారు. జయలక్ష్మి చెప్పే విధానం, మెలకువలు నచ్చడంతో తక్కువ కాలంలోనే ఆమె ఛానల్ చూసే వారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 1.23 లక్షల మంది
సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ‘ఉపాధ్యాయిని ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు’ అని చెబుతూ చేసిన ఓ వీడియో విశేష జనాదరణ పొందింది. కోటి మందికి పైగా వీక్షించారు. ఆమె దగ్గర ఆంగ్లం నేర్చుకుని, ఇంటర్య్వూ మెలకువలు నేర్చుకుని వందల మంది ఉద్యోగాలు సాధించారు. ‘మీవల్లే ఆంగ్లం నేర్చుకున్నా.. మీవల్లే ఉద్యోగం సంపాదించా’ అంటూ ఫోన్లు వస్తాయి. అలాంటప్పుడు జయలక్ష్మి ఎంతో సంతోషపడతారు. ఉపాధ్యాయులు నిత్య నూతనంగా ఉండేందుకు అవసరమైన అంశాలన్నీ ఆకళింపు చేసుకుని తన ఛానల్ ద్వారా అందిస్తూ.. జయలక్ష్మి గురువులకు గురువయ్యారు. ‘జయ వ్లాగ్స్’ పేరుతో గృహిణులకు చిట్కాలు చెప్పే మరో ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. దీనికి 2లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉండటం విశేషం.
ఉప్పాల రాజాపృథ్వీ, ఏలూరు