Bee -భూగోళం మీద అత్యంత విలువైన జీవి అదే…..అది అంతరించిపోతే మానవ మనుగడ లేనట్టే…..

www.mannamweb.com


భూగోళం మీద అత్యంత విలువైన జీవి అదే…..అది అంతరించిపోతే మానవ మనుగడ లేనట్టే…..
భూగోళం మీద ఉన్న జీవ జాతుల్లో అత్యంత ముఖ్యమైన,విలువైన జీవి ‘తేనెటీగ’ అని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్దారించారు.
ప్రపంచవ్యాప్తంగా వాటి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడిపోయిందని ప్రకటించారు. ఇటీవలి అధ్యయనాలు దాదాపుగా 90% తేనెటీగలు అంతరించిపోయినట్టు వెల్లడించాయని తెలిపారు. అడవుల నరికివేత,గూళ్లు కట్టడానికి అనువైన స్థితి లేకపోవడం,పురుగు మందుల వాడకం,నేలల్లో వస్తున్న మార్పుల కారణంగా తేనెటీగల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్టు వెల్లడించారు.
వ్యవసాయ ఆవిష్కరణల ఫౌండేషన్(FIA) సహకారంతో అపికల్చర్ ఎంట్రపెన్యూర్‌షిప్ సెంటర్ ఆఫ్ యూనివర్సదద్,అపికల్చర్ కార్పోరేషన్ ఆఫ్ చిలే సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం తేనెటీగల గురించి ఒక ఆసక్తికర విషయాన్ని నిర్దారించింది. ఈ భూగోళంపై ఉన్న జీవ జాతుల్లో కేవలం తేనెటీగలు మాత్రమే..రోగాలను వ్యాప్తి చేయని జీవులని నిర్దారించారు. ఫంగస్,బాక్టీరియా,వైరస్ వంటి వాటిని తేనెటీగలు వ్యాప్తి చెందించవని అధ్యయనంలో వెల్లడైంది.

తేనెటీగల వల్ల కేవలం తేనె మాత్రమే కాదు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మనం పండిస్తున్న 100 పంటల్లో దాదాపు 70 రకాలు తేనెటీగల వల్లే పరాగసంసర్కం జరిగి ఫలదీకరణం చెందుతాయని చెబుతున్నారు.తేనెటీగలు అంతరించిపోతే.. సమస్త జీవ జాతులకు భవిష్యత్‌లో తిండి దొరకడం కష్టమంటున్నారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రకారం.. తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే.. ఆ తర్వాత మనుషులు బతికేది కేవలం నాలుగేళ్లు మాత్రమే అని చెప్పారు. దీన్నిబట్టి మానవ మనుగడ తేనెటీగలతో ఎంతలా ముడిపడి ఉందో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్ ఫెడరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్ వినియోగం పెరిగిపోవడం కూడా తేనెటీగలు అంతరించడానికి ఒక కారణంగా తెలిపారు.సెల్‌ఫోన్ సిగ్నల్స్ తరంగాల కారణంగా తేనెటీగలు అయోమయానికి గురవుతాయని.. తద్వారా అవి తమ దారిని మరిచిపోయి.. అంతిమంగా వాటి జీవితం ప్రమాదంలో పడిపోతుందని వెల్లడించారు.అడవుల నరికివేతను అరికట్టడం,పురుగు మందులను నిషేధించడం,సహజ వ్యవసాయ ప్రక్రియను ప్రోత్సహించడం,తేనెటీగల ఉనికిపై ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేపట్టడం వంటి చర్యల ద్వారా వాటిని అంతరించిపోకుండా కాపాడవచ్చునన్నారు.