బెజవాడ కార్పొరేషన్‌లో వేగంగా మారతున్న పొలిటికల్ ఈక్వేషన్స్.. ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..

www.mannamweb.com


ఎన్డీయే కూటమి భారీ మెజార్టీ గెలుపుతో బెజవాడ కార్పొరేషన్‌లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. వైసీపీకి గుడ్ బై చెప్పి, కూటమి గూటికి చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు రహస్య మంతనాలు జరుపుతున్నారు. తాజాగా పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే సుజన చౌదరిని కలవటం చర్చనీయాంశంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల ముందే బెజవాడ కార్పొరేషన్‌పై కన్నేసిన ఎన్డీయే కూటమి ఎన్నికల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక, ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసిపి తరపు కార్పొరేటర్ సైతం కండువాలు మార్చేందుకు సిద్ధమైపోయారు. అందులో భాగంగా ఇప్పటికే బెజవాడ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను కాక పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇక బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. ఇందులో గత ఎన్నికల్లో వైసీపీదే పైచేయి మొత్తం 49 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు. 14 మంది టీడీపీ ఒకరు సీపీఎం కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

ఇక డివిజన్ల వారీగా చూస్తే, విజయవాడ వెస్ట్‌లో అత్యధికంగా 22 డివిజన్లకు గాను, 19 డివిజన్లలో వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 21 స్థానాలకు 16 స్థానాలు, తూర్పు నియోజకవర్గంలో 21 స్థానాలకు గాను 14 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. సెంట్రల్ లోనూ తూర్పులను టీడీపీ కాస్త గట్టి పోటీ ఇచ్చి, మిగిలిన సీట్లను సొంతం చేసుకుంది. ఇందులో టీడీపీ కార్పొరేటర్ ఒకరు ఇప్పటికే రాజీనామా చేయగా, మరొకరు అసెంబ్లీ ఎన్నికల ముందే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎన్నికల తర్వాత మళ్లీ సొంత గూటికి వచ్చేశారు.

ప్రస్తుత తాజా పరిణామాలు చూస్తుంటే బెజవాడ కార్పొరేషన్ లో దాదాపు 15 మందికి పైగా కార్పొరేటర్లు కూటమి గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులోనూ ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నుంచి ఎక్కువ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారట. తాజాగా ఏడు మంది కార్పొరేటర్లు బీజేపీ ఎమ్మెల్యే సృజనా చౌదరితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి భేటీ ఇప్పుడు బెజవాడ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మిగిలిన నియోజకవర్గాల సైతం వైసీపీ కార్పొరేటర్లు కూటమి గూటికి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ దొరికిందట. ఇప్పటికే తెలిసినవారి ద్వారా మంత్రాలు జరుపుతున్నారట. దీంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు గోడ దూకేందుకు సిద్ధమవుతున్న కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ మార్పుపై వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారట.

బెజవాడ కార్పొరేషన్ ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైగా గడువు ఉండడంతో కూటమి ప్రభుత్వం సైతం కార్పొరేటర్లు చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. చేర్పులు మార్పులపై కూటమి కాస్త నెమ్మదిగానే వ్యవహరిస్తోంది. అయితే వైసీపీ కార్పొరేటర్లు సై అంటుంటే, కూటమి మాత్రం కాస్త సమయవనం పాటించండి అంటూ సందేశాలు పంపుతోందట. ప్రస్తుత పరిస్థితుల రీత్యా భారీ ఎత్తున కూటమి గూటికి వైసీపీ కార్పొరేటర్లు చేరినా, మేయర్‌ను మాత్రం మార్చే అవకాశం లేకపోవడంతో కూటమి ఆచితూచి అడుగులు వేస్తోంది. కార్పొరేటర్ల మార్పుతో కూటమి బలం పెరుగుతుంది తప్ప నిబంధన ప్రకారం చూస్తే మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న 2025 మార్చి వరకు వేచి వుండాల్సిందే..! దాంతో పదవిని దక్కించుకోలేని కూటమికి ఈ ఈక్వేషన్స్ అన్ని కేవలం బల ప్రదర్శన వరకే ఉపయోగపడతాయి.

గతంలో మేయర్ ను కౌన్సిల్ సభ్యుల ఎన్నికల ద్వారా ఓటింగ్ పద్ధతితో ఎన్నుకునేవారు ఇది రెండు సార్లు మాత్రమే జరిగింది. కానీ గత కొన్ని ఏళ్లుగా అనేక మార్పులు రీత్యా సంఖ్య బలం ఎక్కువ ఉన్న వారు మాత్రమే మేయర్ ను ఎన్నుకుంటున్నారు. ఇలా నిబంధన ప్రకారం పదవి కాలం పూర్తి అయ్యేంత వరకు ఆ సభ్యత్వంతోనే ఆ సభ్యులు కొనసాగుతారు. కాబట్టి పార్టీలు ఫిరాయించిన పెద్దగా మార్పు ఉండదు. ఒకవేళ సభ్యత్వం రద్దైతే గాని బై ఎలక్షన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ప్రస్తుత పార్టీ ఫిరాయింపులతో కేవలం కార్పొరేషన్ లో కూటమి బలం పెరుగుతుంది తప్పా, మేయర్ పదవిని కైవసం చేసుకోలేరు.

ఈ నేపథ్యంలోనే కూటమి నేతల సైతం కార్పొరేటర్ల విషయంలో ఒకంత వెనకడిగి వేస్తున్నారట. అయినప్పటికీ చాలా సమయం ఉండడంతో కార్పొరేటర్లు మాత్రం ఎలాగైనా కూటమి గూటికి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. దీన్ని కట్టడి చేసేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట.