టాలీవుడ్ కు హైకోర్టు పెద్ద షాక్

తెలుగు సినిమాలకు ఇకపై స్పెషల్ షోస్ అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం అర్థరాత్రి 1.30 నుంచి ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు షోస్ వేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.


గేమ్ ఛేంజర్ కు ఇచ్చిన పర్మిషన్లపై దాఖలైన కేసు విచారణలో భాగంగా కోర్టు ఇలా ఆదేశాలు ఇచ్చింది.

హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి లేనట్లే భావించాలి. గేమ్ ఛేంజర్ సినిమాకి టికెట్ల ధరలు పెంపు, స్పెషల్ షోలకు సంబంధించిన పర్మిషన్ పై హైకోర్టులో విచారణ సాగుతుండగా.. తాజా ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేయగా.. ఇకపై సిటీ సహా రాష్ట్రమంతా ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలకు వీలు లేదు.

తెలుగు సినిమా రంగానికి సంబంధించి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కావడం, వాటి కోసం బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచడం వంటివి సాధారణంగా జరుగుతుండేవి. అయితే, పుష్ప 2 సినిమా విడుదల తర్వాత సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న పరిణామాలతో అసలు బెనిఫిట్ షోలకు అనుమతిపై పెద్ద చర్చే జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇకపై తాను ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో లకు అనుమతి ఇచ్చేదే లేదన్నారు.

తర్వాత సంక్రాంతి సినిమాలు రాగా.. హైకోర్టులో పిల్ దాఖలైంది. దీంతో ప్రభుత్వం కూడా గేమ్ ఛేంజర్ సినిమాకు ఇచ్చిన టికెట్ల రేట్ల పెంపును రద్దు చేసింది. ఈ మేరకు కోర్టుకు కూడా అదే విషయాన్ని తెలిపింది. ఆ సందర్భంలోనే హైకోర్టు బెనిఫిట్ షోలను రద్దు చేసినా.. స్పెషల్ షోకి పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరం తెలపగా.. ప్రభుత్వం స్పెషల్ షోస్ కూడా రద్దు చేసింది.

శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఇకపై రాత్రి 1.30 నిమిషాల నుంచి ఉదయం 8గంటల 40 నిమిషాల వరకు ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 21వరకు వాయిదా వేసింది.