Bhagavad Gita: మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది? భగవద్గీత ఏం చెబుతోంది?

మరణానంతర జీవితంపై ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది. చరిత్రలోని పురాతన ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. పురాతన గ్రంథాల నుంచి అత్యాధునిక శాస్త్రీయ పరిశోధనల వరకు ప్రతినిత్యం మరణానంతర జీవితంపై ఏదో ఒక సందేహం ఎప్పుడూ ఒకసారి వస్తూనే ఉంటుంది.


హిందువుల పరమ పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతలో కూడా మరణానంతర జీవితం గురించి ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో మరణానంతర జీవితం గురించి, మరణం గురించి ఎంతో బోధించాడు.

భగవద్గీత ప్రకారం మనుషులంటే… శరీరాలు, వారి భౌతికరూపాలు, మాంసం, ఎముకలు, వారి అనుభవాలు కాదు. మరణం తర్వాత కూడా చలించలేనిది ఒకటి ఉంది… అదే ఆత్మ. కృష్ణుడు చెప్పిన ప్రకారం ఆత్మ పుట్టదు, చనిపోదు. అది నిత్యం జీవించే ఉంటుంది. శరీరం నుంచి శరీరానికి మారుతూ ఉంటుంది. తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఒక శరీరాన్ని ఎంచుకుంటుంది. ఆ శరీరం నాశనం అవగానే మరొక శరీరంలోకి చేరిపోతుంది.

భగవద్గీత ప్రకారం మరణం అనేది ఒక ముగింపు కాదు. అది ఒక మార్గం. ఆత్మ… శరీరం నుండి విముక్తి పొంది మరొక రూపంలోకి వెళ్లడానికి మరణం ఉపయోగపడుతుంది. ఇది ఒక అతీంద్రియ సంఘటనగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆత్మ అనేది ఒక అంతం లేని ప్రక్రియలో భాగం. మరణాన్ని గమ్యస్థానంగా అనుకుంటే కుదరదు. భగవద్గీత ప్రకారం మరణం తర్వాత కూడా ఆత్మ ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంటుంది.

భగవద్గీతలోని రెండవ అధ్యాయం 20వ శ్లోకంలో కృష్ణుడు ఆత్మ గురించి వివరించాడు. అది శాశ్వతమైనదని, దాన్ని ఎవరు నాశనం చేయలేరని చెప్పాడు. అది జననాన్ని, మరణాన్ని పొందదని… అది కేవలం ప్రయాణాన్ని మాత్రమే కొనసాగిస్తుందని వివరించాడు. శరీరం మాత్రమే నశించిపోతుందని, ఆత్మ ఎప్పటికీ నశించదని శ్రీకృష్ణుడి బోధన.

భగవద్గీత ప్రకారం మనిషి రూపంలో ఉన్న వ్యక్తి అతని ధర్మాన్ని, విధిని మాత్రమే పాటించాలి. ఆ విధుల కోసమే ఆయన భూమి మీదకి వస్తాడు. ఆ తర్వాత భౌతిక రూపం నశించిపోతుంది. ఆత్మ మాత్రం మరొక రూపంలో ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతుంది. నిస్వార్థంగా బాధ్యతలను నెరవేర్చడం ద్వారా ఒక వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని, ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతాడు.

భగవద్గీతలో మరణానంతర జీవితం గురించి ఒక్కటే చెప్పారు. మరణం అనేది శరీరానికి, ఆత్మకు కాదు. కాబట్టి ఆత్మకు ఎంతో జీవితం ఉంటుంది. అది శరీరాలను మార్చుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది.

భగవద్గీతలో అంతిమ లక్ష్యంగా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడాన్ని సాధించాలని చెప్పారు. అంటే ఆ వ్యక్తి ప్రాపంచిక ఉనికి నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకొని మోక్షాన్ని పొందుతారు. తిరిగి ఆ వ్యక్తికి జననం అనేది ఉండదు.

అయితే ఇప్పటికి ఎన్నోచోట్ల విశ్వాసాలు సంప్రదాయాల ప్రకారం మరణించిన వ్యక్తికి తిరిగి పునర్జన్మ ఉంటుందని నమ్ముతారు. ఆ పునర్జన్మ మనిషికి కాదు, ఆత్మకు అని అర్థం చేసుకోవాలి. హిందూ మతంలోనే కాదు అన్ని మతాలలో కూడా మరణానంతర జీవితంపై కొన్ని అభిప్రాయాలు నమ్మకాలు ఉన్నాయి.

క్రైస్తవ మతంలో మరణించిన వ్యక్తి పరలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడని నమ్ముతారు. ఆ స్వర్గంలోనే ఆనందాన్ని పొందుతాడని చెప్పుకుంటారు. అక్కడ భగవంతుడితో ఏకమవుతారని, పరలోకంలో తన కన్నా ముందే మరణించిన ప్రియమైన వారితో కలుస్తారని నమ్ముతారు. అయితే జీవితంలో తమకు అప్పచెప్పిన పనులను, బాధ్యతలను, విధులను నెరవేర్చని వారు మాత్రం నరకానికి వెళతారని అంటారు.

ఇక ఇస్లాం విషయానికి వస్తే ఇస్లాంలో కూడా మరణానంతర జీవితంపై ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. వారి స్వర్గాన్ని జన్నా అని, నరకాన్ని జహన్నామ్ అని పిలుచుకుంటారు. మనుషులు చేసే పనుల ద్వారానే వారు స్వర్గానికి వెళ్లాలా? నరకానికి వెళ్లాలా? అనేది నిర్ణయించి ఉంటుందని ఇస్లాంలో నమ్ముతారు. మంచి పనులు చేసిన వారు జన్నాకూ, చెడు పనులు చేసిన వారికి జహానామకు వెళతారని వారి నమ్మకం.