ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను పక్కనబెట్టేసిన కూటమి సర్కార్ ఇప్పుడు సచివాలయాల వ్యవస్ధలోనూ హేతుబద్ధీకరణ పేరుతో కీలక మార్పులు చేస్తోంది. తద్వారా భారీ ఎత్తున సచివాలయ ఉద్యోగుల్ని సైతం పక్కనబెట్టడం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల తొలగింపుల వ్యవహారంపై జరుగుతున్న చర్చపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయాల్లో అస్తవ్యస్ధ పరిస్దితులు ఉన్నాయని, సచివాలయాల సేవలు లబ్దిదారులకు సక్రమంగా అందడం లేదని ఆరోపిస్తూ ఉద్యోగుల హేతుబద్దీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ తాజాగా పూర్తయింది కూడా. అయితే ఇందులో గుర్తించిన ఉద్యోగుల్ని తొలగిస్తారన్న ప్రచారం మొదలైంది. దీనిపై మంత్రి స్వామి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఎవరినీ తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల హేతుబద్ధీకరణ ప్రక్రియ వల్ల సచివాలయాల సంఖ్య తగ్గదని, పెరిగే అవకాశాలే ఉన్నాయని మంత్రి స్వామి తెలిపారు. అలాగే హేతుబద్దీకరణతో కొన్ని పోస్టులు రద్దయ్యాయని, అలాగే సచివాాలయాల్లో ఉద్యోగుల్ని దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోందని, అదంతా నిజం కాదన్నారు. దీనిపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సచివాలయాల హేతుబద్ధీకరణ వల్ల ఈ వ్యవస్ధలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని విపక్షాలు సచివాలయ ఉద్యోగుల్ని తొలగిస్తారనే ప్రచారాన్ని తెరపైకి తెస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సచివాలయ వ్యవస్ధను కానీ, ఉద్యోగుల్ని కానీ తొలగించే ఉద్దేశం తమకు లేదని చెప్తున్నాయి. ఉన్న వ్యవస్ధనే సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే మార్పులు తప్పడం లేదని వెల్లడిస్తున్నాయి.