బొంబాయి చట్నీ అనేది మనదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక చట్నీ. ఇది ముఖ్యంగా పూరీ,ఇడ్లీ,దోశ వంటి టిఫిన్లకు సైడ్ డిష్ గా ఉపయోగిస్తారు. బొంబాయి చట్నీ రుచికి చాలా బాగుంటుంది.
దీనిని ఇంట్లోనే చాలా ఈజీగా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. తియ్యగా,పుల్లగా,కారంగా అన్నీ రకాలుగా టేస్ట్ అద్భుతంగా ఉండే బొంబాయి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
బొంబాయి చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-శెనగపిండి
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-ఆవాలు
-జీలకర్ర
-మెంతులు
-ఇంగువ
-కరివేపాకు
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-టమాటో
-ఉప్పు
-వెల్లుల్లి
-నిమ్మరసం
బొంబాయి చట్నా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు శెనగపిండి వేసి మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు వేయించి ఓ బౌల్ లో వేయండి.
-ఇప్పుడు ఆ పిండిలో ఒకటిన్నర కప్పు నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోండి. కొంచెం పలుచగానే కలుపుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడయ్యాక అందులో చిటికెడు మెంతులు,అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ పచ్చి శెనగపప్పు, అర టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి.
-కొంచెం వేగిన తర్వాత అందులో రెండు ఎండు మిరపకాయ ముక్కలు, పావు టీస్పూన్ ఇంగువ, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్నివేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత అందులోనే 5 కట్ చేసిన వెల్లుల్లిపాయలు,సన్నగా తరిగిన 1 టమాటో ముక్కలు,కరివేపాకు వేసి టమాటో ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఫ్రై చేసుకోండి.
-టమాటో ముక్కలు మెత్తగా అయ్యాక అందులో పావు టీస్పూన్ పసుపు,సరిపడా ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఇందులో ముందుగా కలిపిపెట్టిన శెనగపిండి నీళ్లను పోసేసి కలుపుతూ 3 నిమిషాలు ఉడికించండి. చట్నీ మీకు ఎంత గట్టిగా ఉండాలి,ఎంత పలుచగా ఉండాలనేదాన్ని బట్టి ఉడికించుకోండి.
-చట్నీ దగ్గరపడే సమయంలో అందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. తర్వాత అందులో కొంచెం నిమ్మరసం వేసి కలిపితే చాలు బొంబాయి చట్నీ రెడీ.