పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమవుతోంది. జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకోనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు..
వేసవి సెలవులు పూర్తి కావస్తున్నాయి. పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమవుతోంది. జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకోనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు పుస్తకాల ముద్రణ, సరఫరాను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. రాష్ట్ర సర్కార్ యేటా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. పాఠ్యాపుస్తకాలను రెండు సెమిస్టర్లుగా ముద్రిస్తున్నారు. అన్ని పాఠశాలలకు మొదటి సెమిస్టర్‌కుగానూ దాదాపు 1.64 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం ఉంది. ఇప్పటికే 1.24 కోట్ల పుస్తకాలు ఆయా జిల్లా కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలను చేరవేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ముద్రణ కేంద్రాల నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి మండలాలకు పుస్తకాలను చేరవేసే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇక బ్యాగ్ తేలికే..
పుస్తకాల సైజు తగ్గించి, పిల్లల బ్యాగు మోత తగ్గించాలన్న విద్యాశాఖ నిర్ణయం మేరకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా రెండు పుస్తకాలను కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. ఒకటి, రెండు తరగతులకు మూడు సబ్జెక్టులకు (తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు) కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. ఇలాగే వర్క్‌బుక్‌లన్నింటినీ కలిపి మరోటి తీసుకొచ్చారు. అంటే ఏడాదంతా రెండు పుస్తకాలు మాత్రమే ఉంటాయన్నమాట. ఇక 3, 4, 5 తరగతులకు గణితం, ఈవీఎస్‌ను కలిపి ఒకటి, తెలుగు, ఇంగ్లిష్ కలిపి మరో పుస్తకంగా ముద్రించారు. ఇలానే రెండు చొప్పున వర్క్‌బుక్‌లను కూడా ముద్రించారు. ఈ తరగతులకు నాలుగు పాఠ్యపుస్తకాలే ఉంటాయన్నమాట.
6 నుంచి 9 తరగతుల వరకు తెలుగు, ఆంగ్లం, హిందీ పాఠ్యపుస్తకాలను కలిపి ఒక పుస్తకంగా ముద్రించారు. రెండు సెమిస్టర్లుగా వీటిని ముద్రించారు. 8, 9 తరగతులకు జీవశాస్త్రం, భౌతిక- రసాయన శాస్త్రాలన్నీ ఒకే పుస్తకంగా తీసుకొచ్చారు. ఇక సోషల్ స్టడీస్‌లో భౌగోళిక, చరిత్ర, ఆర్థిక, పౌరశాస్త్రాలు కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారు. గణితం మాత్రం ఏ తరగతి ఆ తరగతి పాఠ్యపుస్తకం విడిగా ఉంటుంది. మొత్తంగా మొదటి సెమిస్టర్‌కు 6 నుంచి 9 తరగతులకు 4 పాఠ్యపుస్తకాలు అందిస్తారు. అక్టోబరులో రెండో సెమిస్టర్ పుస్తకాలు అందిస్తారు. అయితే పదో తరగతికి వచ్చేసరికి మాత్రం సెమిస్టర్ విధానం లేకుండా ప్రతి సబ్జెక్టుకు విడిగా పుస్తకాలు ముద్రించారు.