కేవలం రెండు లక్షల రూపాయలతో మంచి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే. మీరు ఈ వ్యాపారాన్ని ఏ సీజన్‌లోనైనా చేసుకోవచ్చు.
ఈ వ్యాపారం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. అదే టొమాటో సాస్ బిజినెస్. అయితే దీనిని ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, లాభాలు ఎలా ఉంటాయానేది ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి డిమాండ్
ప్రస్తుతం టొమాటో సాస్‌ను అనేక మంది పలు రకాల ఆహారాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా బ్రెడ్, పిజ్జా, రోల్స్, చౌ మెయిన్, బర్గర్‌లు వంటి వివిధ రకాల స్నాక్స్‌లో వినియోగిస్తున్నారు. దీంతో దీనికి మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు టొమాటో సాస్ లేకుండా చాలా మంది ఆయా ఆహారాలను తీసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో టమోటా సాస్ వ్యాపారం చేయడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు.
పన్నెండు నెలలు..
ప్రపంచంలోని టొమాటో ఉత్పత్తిదారులలో భారతదేశం టాప్ దేశాలలో ఒకటిగా ఉంది. టొమాటోలు పన్నెండు నెలలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఈ వ్యాపారం చేయడం సులభం అవుతుంది. టొమాటో సాస్ చేయడానికి ముందు మొదట మీరు టమోటాలు కొనాలి. పండిన టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవిరి కెటిల్‌లో ఉడకబెట్టాలి. ఆ తరువాత టమోటా పేస్ట్ తయారవుతుంది. అప్పుడు దాని నుంచి విత్తనాలు, ఫైబర్ వేరు చేయాలి. తర్వాత వెనిగర్, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, ఉప్పు, పంచదార కలిపిన రసంలో కలుపాలి. అది చెడిపోకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను కూడా ఉపయోగిస్తారు.
రుణ సౌకర్యం కూడా
ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి మార్కెట్లో సేల్ చేయాలి. టొమాటో సాస్ తయారీ యంత్రాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఇన్‌స్టాల్ చేయడానికి పెద్ద స్థలం అవసరం లేదు. ఓ నివేదిక ప్రకారం ఈ వ్యాపారంలో సంవత్సరానికి 28 నుంచి 40 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చని తెలుస్తోంది. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద రుణాన్ని కూడా పొందవచ్చు. అయితే ఈ వ్యాపారానికి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.