అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు గట్టి పోటీనిస్తున్న చైనా కంపెనీ బీవైడీ తాజాగా ఆదాయంపరంగా పోటీ సంస్థను అధిగమించింది. బ్యాటరీ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహన విక్రయాలు 40% ఎగియడంతో 2024లో 107 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. గతేడాది టెస్లా ఆదాయం 97.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మరోవైపు 2024లో బీవైడీ నికర లాభం 34% పెరిగి 5.6 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ గతేడాది 43 లక్షల ఈవీలను విక్రయించింది. ఇందులో 29% అమ్మకాల వాటా చైనా వెలుపల హాంకాంగ్, తైవాన్ తదితర దేశాలదే ఉంది. బీవైడీ ఈ మధ్యే 5 నిమిషాల్లోనే వాహనాలను చార్జింగ్ చేసే సూపర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ సిస్టంను ప్రకటించింది. అలాగే, టెస్లా మోడల్ 3 పోలిన కిన్ ఎల్ ఈవీ సెడాన్‌ను సగం రేటుకే ప్రవేశపెట్టింది.
ఇదిలాఉండగా, టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్న సంస్థ.. తాజాగా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో ‘మోడల్ వై, మోడల్ 3’ కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది.
హోమోలోగేషన్ అనేది.. ఒక వాహనం రహదారికి యోగ్యమైనదని, భారతదేశంలో తయారు చేసిన లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. కేంద్ర మోటారు వాహన నియమాలకు అనుగుణంగా ఉద్గారం, భద్రత, రహదారి యోగ్యత పరంగా వాహనం భారత మార్కెట్ అవసరాలకు సరిపోతుందని సంబంధిత శాఖ నిర్దారించాలి.