కాంపా కోలా ఎఫెక్ట్‌.. పెప్సీ, కోకాకోలా నుంచి ₹10కే నో-షుగర్‌ డ్రింక్స్‌

సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌లైన పెప్సీ, కోకాకోలా కొత్త వ్యూహాలకు పదునుపెట్టాయి. రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) తీసుకొచ్చిన సాఫ్ట్‌ డ్రింక్‌ బ్రాండ్‌ కాంపా (campa) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో.. పెప్సీ, కోకాకోలా తక్కువ ధరలో సాఫ్ట్‌ డ్రింక్స్‌ను తీసుకొచ్చాయి. రూ.10తో చిన్న ప్యాక్‌లో డైట్‌, లైట్‌ వేరియంట్‌లలో పానీయాలను అందుబాటులోకి తెచ్చాయి.


కోకాకోలా, పెప్సీ ఇరు సంస్థలు థమ్స్‌ ఆఫ్‌ ఎక్స్‌ ఫోర్స్‌, కోక్‌ జీరో, స్ప్రైట్‌ జీరో, పెప్సికో నో- షుగర్‌ అనే బ్రాండ్ల పేరుతో రూ.10కే డ్రింక్స్‌ను ప్రవేశపెట్టాయి. డైట్‌, లైట్‌ వేరియంట్లలో నో- షుగర్‌ పానీయాల్ని తీసుకొచ్చాయి. డైట్‌, లైట్‌ వేరియంట్లలో ఈ ధరలో భారత మార్కెట్లలోకి తీసుకురావడం ఇదే తొలిసారి అని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. తక్కువ ధరలో ఈ ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో కంపెనీలు తమ ప్రధాన బ్రాండ్‌లపై ధరల తగ్గింపును నివారించేందుకు ప్రయత్నిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

లో షుగర్, నో- షుగర్‌ పానీయాలకు ఇటీవల కాలంలో డిమాండ్ పెరుగుతోందని కోకాకోలా ఎంఎంజీ గ్రూప్‌ ఛైర్మన్‌ సంజీవ్‌ అగర్వాల్ అన్నారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. ఈ పానీయాలు 200 ఎంఎల్‌ ధర రూ.10 నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. 500ఎంఎల్‌ సర్వింగ్‌ సైజుల్లో కూడా తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇక పెప్సికో నో- షుగర్‌ డ్రింక్‌ 200 ఎంఎల్‌ ధర రూ.10గా ఉంది. దేశంలో అతిపెద్ద కోలా మార్కెట్లలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. 2023లో కాంపా అరంగేట్రం చేసిన ప్రాంతంలోనే పెప్సికో కూడా కొత్త ఉత్పత్తులను తొలుత అందుబాటులోకి తేవడం గమనార్హం.

ప్రస్తుతం మార్కెట్లో కాంపా 200 ఎంఎల్‌ బాటిల్‌ ధర రూ.10గా ఉంది. భారత సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లో 1980ల్లో కాంపాదే హవా. 1990ల్లో ఎప్పుడైతే విదేశీ సంస్థలైన పెప్సీ, కోకాకోలా భారత్‌లోకి ప్రవేశించాయో ఈ బ్రాండ్‌ కనుమరుగవడం ప్రారంభమైంది. ఆ తర్వాత కాంపా బ్రాండ్‌ను ప్యూర్‌ డ్రింక్స్‌ నుంచి రిలయన్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఈ విభాగంలో రాణిస్తున్న కోలా, పెప్సీ కంపెనీలు పోటీని ఎదుర్కొంటూ వచ్చాయి.