కేంద్ర క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త స్కీమ్ కి ఆమోద ముద్ర వేసింది. ఈ స్కీమ్ కింద.. కొత్తగా జాబ్ వచ్చిన వారికి నెల జీతం ముందే వారి బ్యాంకు ఖాతాలో పడుతుంది.
ఆ పథకం ఫుల్ డిటైల్స్ లోకి వెళితే..
ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. అందులో ఒకటి ELI స్కీమ్. ELI అంటే.. ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ELI పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం భారీగా(రూ.1.07 లక్షల కోట్లు) నిధులు కేటాయించింది. ఇది ఉపాధిని పెంచే కొత్త పథకం. దీని ద్వారా దేశంలోని యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉపాధిని పెంచే ఈఎల్ ఐ స్కీమ్.. మోదీ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఒక గొప్ప బహుమతిగా క్యాబినెట్ అభివర్ణించింది.
ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం (ELI) పథకాన్ని మొదట 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ మంది కార్మికులను నియమించుకునేలా ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. ELI స్కీమ్ ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. దీని మొత్తం బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు. మొదటి దశ కింద కేంద్రం రూ.1.07 లక్షల కోట్లు కేటాయించింది.
ఈఎల్ ఐ స్కీమ్.. ప్రభుత్వం మద్దతుతో నడిచే కార్యక్రమం. దీని ముఖ్య లక్ష్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడం. ముఖ్యంగా వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలు పెంచడం దీని ఉద్దేశం. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన పనులు చేస్తుంది. మొదటిసారి ఉద్యోగం చేసే వారికి సాయం చేస్తుంది. నెల జీతం ముందే వేస్తుంది. కొత్త ఉద్యోగాలు సృష్టించే యజమానులకు ప్రోత్సాహకాలు ఇస్తుంది. తయారీ రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
ELI స్కీమ్.. మూడు ప్రధాన ఉద్యోగ ప్రణాళికలు..
ELI పథకంలో మూడు కీలక ప్రణాళికలు ఉన్నాయి. ప్లాన్ A, B,C.
ప్లాన్ A: కొత్తగా నియమించుకున్న కార్మికులకు ఒక నెల జీతం ముందే ఇవ్వడం.
ప్లాన్ B: తయారీ రంగంలో ఉపాధి కల్పనకు ప్రోత్సాహం.
ప్లాన్ C: అన్ని రంగాల్లో అదనపు ఉద్యోగాలను సృష్టించడానికి కంపెనీలకు ఆర్థిక సాయం అందించడం.
ఈ ప్రణాళికల ద్వారా ప్రభుత్వం దాదాపు 3.1 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ స్కీమ్ ద్వారా రెండు రకాలుగా ప్రజలకు లాభం చేకూరుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. మొదటిసారి ఉద్యోగం చేసేవారికి, అలాగే ఉద్యోగాలు సృష్టించే యజమానులకు లాభం ఉంటుందని చెబుతున్నారు. కొత్తగా జాబ్ తెచ్చుకున్న వారికి నెల ముందే జీతం అందుతుంది. ఇది గరిష్టంగా 15వేల వరకు ఉంటుంది. ఇది వారికి ఆర్థికంగా సాయపడుతుంది. కొత్త ఉద్యోగాలు సృష్టించినందుకు యజమానులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ ప్రోత్సాహకాలు రెండేళ్ల పాటు ఉంటాయి. ఒకవేళ యజమాని తయారీ రంగంలో ఉంటే, ఈ ప్రోత్సాహకాలను ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగిస్తుంది. అంటే మొత్తం నాలుగేళ్లు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
ఈఎల్ ఐ స్కీమ్ తో దేశంలో నిరుద్యోగం తగ్గడంతో పాటు తయారీ రంగం బలపడుతుందని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనా వేశారు.
నైపుణ్య శిక్షణ, విద్యపై దృష్టి..
* నైపుణ్య శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలకు రూ. 63,000 కోట్లు ఖర్చు చేస్తారు.
* ఐటిఐలను (పారిశ్రామిక శిక్షణ సంస్థలు) ఆధునీకరణకు రూ.30,000 కోట్లు వెచ్చిస్తారు.
* ఇది యువత మెరుగైన శిక్షణ పొందేందుకు, ఉద్యోగానికి సిద్ధంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కి ఆమోదం తెలపడంతో పాటు కేంద్ర మంత్రివర్గం మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పరిశోధన, అభివృద్ధి (R&D)కి మద్దతివ్వడానికి లక్ష కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదించింది. ఆర్ అండ్ డీ ఫండింగ్ ద్వారా పరిశోధన, అభివృద్ధి రంగంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తారు. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టడానికి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు. పరిశోధన, అభివృద్ధి నిధులు సాంకేతిక ఆవిష్కరణ, పరిశ్రమ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి.
* ELI కొత్త ఉద్యోగులు, యజమానులకు మద్దతిస్తుంది.
* యువతకు మెరుగైన నైపుణ్య అభివృద్ధి లభిస్తుంది
* ఐటీఐలు అధునాతన సాంకేతిక విద్యను అందిస్తాయి.
కేంద్ర క్యాబినెట్ తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు..
మరో మూడు ప్రధాన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం..
* తమిళనాడులోని పరమకుడి-రామనాథపురం జాతీయ రహదారి 4 లేన్లుగా విస్తరించడానికి ఆమోదం. దీని కోసం రూ. 1,853 కోట్లు కేటాయింపు.
* రామనాథపురం-ధనుష్కోడి హైవే పురోగతి.
* ప్రస్తుత జాతీయ క్రీడా విధానాన్ని భర్తీ చేసే ఖేలో ఇండియా పాలసీ 2025 ఆమోదం.
* జాతీయ క్రీడా విధానం 2025.. దేశంలో క్రీడా సౌకర్యాలను పెంచడం, క్రీడాకారులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
ఈ నిర్ణయాలు ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, యువత అభివృద్ధిపై ప్రభుత్వం బలమైన దృష్టిని ప్రతిబింబిస్తాయి.