Chandrababu: పింఛన్లు ఇంటివద్దే ఇచ్చేలా ఆదేశించండి

www.mannamweb.com


అమరావతి: పింఛన్‌దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ ఈసీకి అందజేశారు. పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినట్లు కనిపించలేదని లేఖలో పేర్కొన్నారు.

‘‘ఏప్రిల్‌ నెలలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని పింఛన్‌ దారులను జగన్‌ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. పింఛను పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దాదాపు 33 మంది వృద్ధులు ఎండవేడి తట్టుకోలేక మృతి చెందారు. వైకాపా దుర్మార్గపు ఆలోచనలతో, రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. జవహర్‌రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. జగన్‌ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నారు’’అని లేఖలో పేర్కొన్నారు.

‘‘మే నెల పింఛన్‌ పంపిణీకి ఇంకా ఐదు రోజులే సమయం ఉంది. గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందును ఇంటింటికీ పింఛను పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. ఇంటి వద్దనే పింఛను పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని కోరారు. పింఛన్లు ఇవ్వకుండా ఈ అంశాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని చూస్తున్నారు. 62వేల మంది వాలంటీర్లతో రాజీనామా చేయించి.. ఇప్పుడు వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించేందుకు వైకాపా కుట్ర పన్నుతోంది. ఈసీకి ఉన్న అపరిమిత అధికారాలను ఉపయోగించి.. వాలంటీర్లుగా చేసిన వారు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలి’’అని ఈసీని కోరారు.