బిల్‌గేట్స్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. ఎవరైనా ఆయనను ఒక్కసారి కలిసే అవకాశం వస్తే మహాభాగ్యంగా భావిస్తారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు అంతకుమించి దొరికింది. బిల్‌గేట్స్ సహాయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టించిన సీఎం చంద్రబాబు రేపు ఐదు కీలక రంగాల్లో ఒప్పందాలు చేసుకోబోతున్నారు. టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఇండియాలోనే బ్రాండ్ అంబాసిడర్‌గా చెప్పుకునే సీఎం చంద్రబాబు సాఫ్ట్‌వేర్ రంగాన్ని ఓ మలుపు తిప్పిన ప్రపంచ ప్రఖ్యాత బిల్‌గేట్స్ దోస్తులు అయ్యారు. ఇద్దరు కలిసింది చాలా తక్కువసార్లే.
అయినా టెక్నాలజీకి మించి ఇద్దరి మధ్య బోలెడు బంధం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు తొలిసారి బిల్‌గేట్స్‌ను కలిసే ప్రయత్నం చేశారు. అందుకు బిల్‌గేట్స్ కార్యాలయం నుంచి నో అనే సమాధానం వచ్చిన చంద్రబాబు నిరాశపడలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నించడంతో బిల్‌గేట్స్‌ను కలిసే అవకాశం దొరికింది. కానీ చంద్రబాబుకు పదినిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. అయినా నిరాశపడకుండా అదే సదవకాశంగా తీసుకున్న చంద్రబాబు ఉమ్మడి ఏపీ మీద తనకు ఉన్న ప్రేమను, అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను, అభివృద్ధి ప్రణాళికలను బిల్‌గేట్స్ ముందు ఆవిష్కరించారు. చంద్రబాబు ప్రజెంట్‌షన్‌కు ముగ్ధుడైన బిల్‌గేట్స్ చంద్రబాబుకు ఇచ్చిన పదినిమిషాల సమయాన్ని మరిచిపోయారు. అలా ఇద్దరి మధ్య 45 నిమిషాల సుదీర్ఘ సమావేశం జరిగింది.
































