ఏపీ ఈఏపీసెట్-2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షలు మే 19 నుంచి 27 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగాయి.
మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించారు. మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరిగాయి. వీటి ఫలితాలను జూన్ 8వ తేదీన ఫలితాలను విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన EAPCET కౌన్సిలింగ్ ఈ నెల(జూలై) 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణలో ఇప్పటికే కౌన్సెలింగ్ మొదలుకావడంతో వారితో పాటే ఇక్కడా పూర్తిచేసేందుకు షెడ్యూల్‌లో మార్పు చేసినట్లు సెట్ కన్వీనర్ గణేశ్‌కుమార్ తెలిపారు.
దీనిపై రేపు(శనివారం) ప్రకటన విడుదల కానుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 16 తేదీల్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు.10 నుంచి 18వ తేదీల్లో వెబ్ ఆప్షన్స్‌కు అవకాశమిస్తారు. 19వ తేదీన వెబ్‌ఆప్షన్ల మార్పు చేసుకోవడానికి అవకాశం. 22న సీట్లు కేటాయించనున్నారు. కాలేజీల్లో రిపోర్టింగ్ 23వ తేదీ నుంచి 26 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే నెల(ఆగస్టు) 4వ తేదీన తరగతులు ప్రారంభం కానున్నాయి. కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులకు వద్ద ఉండాల్సిన పత్రాలు: ఏపీ ఈఏపీసెట్ ర్యాంక్ కార్డు, ఏపీ ఈఏపీసెట్ హాల్‌టికెట్, పదో తరగతి మెమో, ఇంటర్ మెమో, ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, లోకల్ క్యాండెట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.