యూపీఐ మోసాలకు చెక్‌

చెల్లింపు కోసం మొబైల్‌కు రిక్వెస్ట్‌ పంపే పద్ధతికి స్వస్తిచురుకుగా పరిశీలిస్తున్న ఎన్‌పీసీఐ


ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ చెల్లింపుల్లో ముఖ్యంగా యూపీఐ విధానంలో మోసాలను అరికట్టేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.

యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ద్వారా జరిగే లావాదేవీల్లో కొన్ని మార్పులు చేసేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగానే, వినియోగదారుల నుంచి వ్యాపారులు డబ్బు వసూలు చేసుకునేందుకు అమల్లో ఉన్న ‘కలెక్ట్‌/పుల్‌ రిక్వెస్ట్‌’ పద్ధతిని దశలవారీగా నిలిపి వేయాలని యోచిస్తోంది. ఈ విషయమై బ్యాంకులు, సంబంధిత భాగస్వాములతో ఎన్‌పీసీఐ చర్చలు నిర్వహిస్తోంది.

ఏమిటిది?: మీరు ఒక దుకాణానికి వెళ్లారనుకోండి.. అక్కడ కొనుగోళ్లు పూర్తి చేశాక, బిల్లింగ్‌ చేసే వ్యక్తి యూపీఐతో అనుసంధానమైన మీ ఫోన్‌ నంబరు అడుగుతారు. మీరు చెప్పిన యూపీఐ యాప్‌లోకి లేదా సంక్షిప్త సందేశం రూపంలో ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా ‘కలెక్ట్‌ /పుల్‌ రిక్వెస్ట్‌’ పంపిస్తారు. మీరు దాన్ని క్లిక్‌ చేసి, యూపీఐ పిన్‌ నమోదు చేస్తే, చెల్లింపు పూర్తవుతుంది. దీంతోపాటు సంస్థలు వినియోగదారుల అనుమతితో, వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా డబ్బు డెబిట్‌ చేసుకుంటున్నాయి. ఉదాహరణకు ప్రతినెలా/ఏడాదికోసారి చెల్లింపులు చేయాల్సి ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకునే ఆటో డెబిట్‌ లాంటి ఏర్పాటన్నమాట. ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు వినియోగదారుల నుంచి డబ్బు కాజేస్తున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. ఈ నేపథ్యంలోనే, వినియోగదారుల ఆర్థిక భద్రత మెరుగుపర్చేందుకు ఎన్‌పీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోనుంది.

ప్రత్యామ్నాయం ఉందా?: ‘పుల్‌’ లావాదేవీలను తొలగిస్తే, వినియోగదారులు ‘పుష్‌’ విధానాన్ని వినియోగించాల్సి ఉంటుంది. అంటే.. వినియోగదారులు తమ ఖాతాల నుంచి స్వయంగా డబ్బును వ్యాపారులు/వ్యక్తులకు పంపించాలి. అంటే, మనం ఎవరికైనా డబ్బు పంపాల్సి వచ్చినప్పుడు, వారి ఫోన్‌ నంబరు తీసుకుని.. దానికి నగదు పంపడం లేదా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, చెల్లింపు చేయడం. నిజానికి ఇవే సురక్షిత మార్గాలు. ఇందువల్ల మోసపూరిత లావాదేవీల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభావం ఎలా?: పుల్‌/కలెక్ట్‌ రిక్వెస్ట్‌ లావాదేవీలను తొలగిస్తే.. ఆటో డెబిట్, రికరింగ్‌ చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎన్‌పీసీఐ కొత్త పద్ధతి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు.